కరోనా రికవరీల్లో భారత్ టాప్ ప్లేస్ లో నిలిచింది. వైద్యసేవలు, ఆక్సిజన్ బెడ్లు, డాక్టర్లు, నర్సింగ్ సిబ్బంది సంఖ్య అధికంగా ఉన్న అమెరికా, ఫ్రాన్స్, ఇంగ్లండ్ వంటి దేశాలతో పోలిస్తే.. భారత్‌లో కరోనా రికవరీలు ఊపందుకున్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రపంచంలోనే అత్యధికంగా 62,27,296 మంది కరోనా నుంచి కోలుకున్నారని పేర్కొంది. బ్రెజిల్‌లో ప్రతి 10 లక్షల మందిలో 23,911 మందికి.. అమెరికాలో 23,072, రష్యాలో 8,992, ఇంగ్లండ్‌లో 8,893 మందికి వైరస్ సోకుతుండగా.. భారత్‌లో ఆ రేటు 5,199గా ఉందని వివరించింది.
పాజిటివ్‌ల రేటు మూడు వారాలుగా తగ్గుతూ వస్తోందని.. ప్రస్తుతం 5.16శాతంగా ఉందని కేంద్ర వైద్య శాఖ కార్యదర్శి రాజేశ్‌భూషణ్ వెల్లడించారు. మరణాల రేటు భారత్‌లో తక్కువ (1.53శాతం)గా ఉందన్నారు. భారత్‌లో యాక్టివ్ కేసులు తగ్గుతూ.. ప్రస్తుతం 11.69శాతానికి చేరుకున్నాయని వివరించారు. యాక్టివ్ కేసులు ఎక్కువగా మహారాష్ట్ర(25శాతం), కర్ణాటక (13శాతం), కేరళ(11శాతం) రాష్ట్రాల్లో ఉన్నాయని తెలిపారు. గత 24 గంటల్లో మరో 77,760 మంది కోలుకోవడంతో.. రికవరీల రేటు 86.78శాతానికి పెరిగిందన్నారు. దేశంలో మొత్తం కేసులు 71,75,881కి చేరాయి. వీరిలో ఇప్పటివరకు 62,27,296 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. మరో 706 మంది కరోనాకు బలయ్యారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1,09,856కి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.