భారత్‌లో డిసెంబర్ వరకు కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని సీరమ్ ఇనిస్టిట్యూట్ సీఈవో అదర్ పూనావాలా అన్నారు. ఈ మేరకు ఆయన ఓ మీడియా సంస్థకు తాజాగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన కరోనా వ్యాక్సిన్‌ను భారత్‌లో పెద్ద ఎత్తున ఉత్పత్తి చేసేందుకు గాను ఇప్పటికే సీరమ్ ఇనిస్టిట్యూట్ ఒప్పందం చేసుకుంది. అలాగే నోవావాక్స్ అనే మరో కంపెనీ తయారు చేసే కరోనా వ్యాక్సిన్‌ను కూడా సీరమ్ ఇనిస్టిట్యూట్ భారత్‌లో ఉత్పత్తి చేయనుంది. ఈ క్రమంలో ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన వ్యాక్సిన్‌ను సీరమ్ ఇనిస్టిట్యూట్ భారత్‌లో పంపిణీ చేయనుంది.
ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకా సంస్థలు కలిసి కరోనా వ్యాక్సిన్‌ను తయారు చేయగా.. దాన్ని భారత్‌లో కోవిషీల్డ్ పేరిట విక్రయించనున్నారు. ఈ వ్యాక్సిన్ ఒక్క డోసును కేవలం రూ.225 కే విక్రయిస్తామని పూనావాలా ఇది వరకే చెప్పారు. ఇక ఈ వ్యాక్సిన్‌కు గాను ఫేజ్ 2, 3 ట్రయల్స్‌ను ఆగస్టు చివరి వరకు చేపట్టనున్నారు. మొత్తం 1000 మందితో ట్రయల్స్ నిర్వహిస్తారు. అలాగే మరో 2 నెలల్లో వ్యాక్సిన్ ధరను నిర్ణయించి అందుబాటులోకి తెస్తారు.
కాగా ఈ ఏడాది చివరి వరకు సీరమ్ ఇనిస్టిట్యూట్ సుమారుగా 400 మిలియన్ల కరోనా వ్యాక్సిన్ డోసులను సిద్ధం చేయనుంది. తాము ఉత్పత్తి చేసే వ్యాక్సిన్లలో సగం వ్యాక్సిన్లను భారత్‌కే నెల నెలా అందజేస్తామని సీరమ్ ఇనిస్టిట్యూట్ గతంలోనే చెప్పింది. అయితే మరోవైపు భారత్ బయోటెక్‌కు చెందిన కోవ్యాక్సిన్ సీరమ్ ఇనిస్టిట్యూట్ వ్యాక్సిన్ కన్నా ముందుగానే దేశంలోకి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ కంపెనీతో ఐసీఎంఆర్ పనిచేస్తుంది. కనుక భారత్ బయోటెక్ వ్యాక్సినే మన దేశంలో త్వరగా అందుబాటులోకి వచ్చేందుకు అవకాశం ఉంది.