నేటి నుంచే వెలుగులోకి న‌ల్ల‌కుభేరుల ఖాతాలు

-

న‌ల్ల‌ధ‌నంపై పోరులో కేంద్ర ప్ర‌భుత్వం మ‌రో ముంద‌డుగు వేసింది. స్విస్ బ్యాంకుల లోగుట్టు ఇక నుంచి బ‌ట్ట‌బ‌య‌లు కానుంది. భార‌తీయ న‌ల్ల‌కుభేరులెవ‌రో వారు దాచుకున్న డ‌బ్బు ఎంతో కేంద్రానికి తెలియ‌నుంది.  స్విట్జర్లాండ్‌లోని బ్యాంకుల్లో భారతీయులకు సంబంధించిన ఖాతాల వివరాలు నేటి నుంచి భారతీయ పన్ను అధికారులకు అందుబాటులోకి రానున్నాయి. ఇరుదేశాల ఆటోమేటిక్‌ సమాచార మార్పిడి ఒప్పందం మేర‌కు సెప్టెంబ‌ర్ ఒక‌టో తేదీ నుంచి అమల్లోకి రానుండటంతో స్విస్‌ ఖాతాల వివరాలు భారత్‌కు తెలియనున్నాయి.


నల్లధనంపై కేంద్ర‌ ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి ఇది దోహదపడుతుందని, దీంతో స్విస్‌ బ్యాంకుల లోగుట్టు ఇక నుంచి బ‌ట్ట‌బ‌య‌లేన‌ని కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి (సీబీడీటీ) తెలిపింది. అంతేగాకుండా.. దీనిపై సీబీడీటీ ఆదాయపు పన్ను విభాగానికి కూడా ఓ విధానాన్ని రూపొందించింది. స్విట్జర్లాండ్‌ అంతర్జాతీయ ఫైనాన్స్‌ విభాగానికి చెందిన ఉన్నతాధికారి నికోలస్‌ మారియో ఆగ‌స్టు 29, 30వ‌ తేదీల్లో భారత రెవెన్యూ కార్యదర్శి ఏబీ పాండే, సీబీడీటీ చైర్మన్‌ పీసీ మోదీలతో భేటీ అయి దీనిపై చర్చించారు. ఆర్థిక ఖాతాల సమాచార మార్పిడి కార్యక్రమం సెప్టెంబర్ 1వ‌ నుంచి అమల్లోకి వస్తుందని వారు చెప్పారు.

పన్నుల‌కు సంబంధించిన భారత్‌ కోరిన కొన్ని ప్రత్యేక కేసుల సమాచార మార్పిడి ప్రక్రియను వేగవంతం చేయడంపైనా ఇరుదేశాల అధికారులు చర్చించడం గ‌మ‌నార్హం. ఈ నేప‌థ్యంలోనే స్విట్జర్లాండ్ బ్యాంకుల్లో 2018 సంవత్సరంలో భారతీయులు నిర్వహించిన అన్ని ఆర్థిక లావాదేవీల వివరాలను భారత్‌ అందుకుంటుందని సీబీడీటీ ఓ ప్రకటనలో పేర్కొంది. అంతేగాకుండా… ఇందులో 2018లో క్లోజ్‌ అయిన ఖాతాల వివరాలు కూడా ఉంటాయని అందులో పేర్కొంది. ఈ నేప‌థ్యంలో ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ మొద‌లైంది.

ఈ ప‌రిణామం మోడీ ప్ర‌భుత్వానికి ప్ర‌జ‌ల్లో ఎంతో సానుకూల‌త‌ను తీసుకొస్తుంద‌నే టాక్ వినిపిస్తోంది. నిజానికి.. 2014 ఎన్నిక‌ల్లో ప్ర‌ధాని అభ్య‌ర్థిగా మోడీ.. న‌ల్ల‌ధ‌నంపై పోరు మాట‌నే ప్ర‌ధాన ఎజెండాగా తీసుకుని ప్ర‌జ‌ల్లోకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. న‌ల్ల‌కుభేరుల భ‌ర‌తంప‌డుతామ‌ని అప్ప‌ట్లో మోడీ చెప్పుకొచ్చారు. ఇక అప్ప‌టి నుంచి స్విస్ ఖాతాల‌కు సంబంధించిన అంశం అనేక మ‌లుపులు తిరుగుతూనే ఉంది. ఎట్ట‌కేల‌కు ఖాతాల వివ‌రాలు భార‌త్‌కు తెలియ‌నుండ‌డంతో త‌దుప‌రి చ‌ర్య‌లు ఎలా ఉంటాయోన‌ని అంద‌రూ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news