ఆస్ట్రేలియాలో 4 టెస్టుల సిరీస్ పర్యటనలో ఉన్న టీమిండియా కఠిన నిర్ణయం తీసుకోనుందా ? అంటే అందుకు అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇటీవల మెల్బోర్న్లో పలువురు భారత క్రికెటర్లు బయో సెక్యూర్ బబుల్‌ను వీడి ఓ హోటల్లో ఓ అభిమానితో కలిసి ఫుడ్ తినడం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అయితే ఆ సంఘటనను దృష్టిలో ఉంచుకుని క్వీన్స్లాండ్ హెల్త్ షాడో మినిస్టర్ రాస్ బేట్స్ కఠిన వ్యాఖ్యలు చేశారు. బ్రిస్బేన్‌లో టెస్ట్ మ్యాచ్ ఆడదలిస్తే భారత క్రికెటర్లు అక్కడి నిబంధలను 100 శాతం పాటించాల్సిందేనని, లేదంటే రావొద్దని ఆమె అన్నారు. దీంతో వివాదం రాజుకుంది.
క్వీన్స్లాండ్ హెల్త్ మినిస్టర్ అలాంటి వ్యాఖ్యలు చేయడంపై బీసీసీఐ గుర్రుగా ఉందని సమాచారం. భారత క్రికెటర్లపై అలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని బీసీసీఐ ఇదివరకే స్పష్టం చేసింది. అయితే టీమిండియా మాత్రం బ్రిస్బేన్‌లో జనవరి 15 నుంచి జరగనున్న చివరిదైన 4వ టెస్ట్ మ్యాచ్‌ను ఆడొద్దని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. కానీ దీనిపై ఇంకా మల్లగుల్లాలు పడుతున్నారు. అందువల్ల సస్పెన్స్ అయితే వీడడం లేదు.
అయితే నిజానికి టీమిండియా 4వ టెస్టు ఆడనున్న క్వీన్స్‌లాండ్‌లో కరోనా కేసులు భారీ సంఖ్యలో నమోదు అవుతున్నాయి. అందువల్ల అక్కడ కఠినమైన ఆంక్షలను విధించారు. ఆ రాష్ట్ర సరిహద్దులను మూసి వేశారు. టీమిండియా, ఆస్ట్రేలియా క్రికెటర్లను ప్రత్యేక ఏర్పాట్ల ద్వారా బ్రిస్బేన్‌కు తరలించనున్నారు. అయితే బ్రిస్బేన్‌లో క్రికెటర్లు కఠినమైన నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. కేవలం హోటల్‌కు, గ్రౌండ్‌కు మాత్రమే పరిమితం కావాలి. ఐపీఎల్ సందర్భంగా దుబాయ్‌లో క్రికెటర్లు ఇలాంటి నిబంధనలనే పాటించారు. కానీ ఇప్పుడు వారికి ఏం ఇబ్బంది కలుగుతుందో తెలియడం లేదు కానీ, కఠినమైన నిబంధనలు ఉంటే మాత్రం ఆడే ప్రసక్తి లేదని టీమిండియా క్రికెటర్లు ఇప్పటికే బీసీసీఐతో అన్నట్లు తెలిసింది. దీంతో సిరీస్ ను సిడ్నీ టెస్ట్‌తోనే ముగించేస్తారా, 4వ టెస్టు మ్యాచ్ ఆడరా ? అన్న సందేహాలు కలుగుతున్నాయి. అయితే ఈ విషయంపై అటు క్రికెట్ ఆస్ట్రేలియా, ఇటు బీసీసీఐ ఇంకా అధికారికంగా ప్రకటన విడుదల చేయలేదు. అందువల్ల ఇప్పటికైతే బ్రిస్బేన్ టెస్టు జరుగుతుందనే అనుకోవాల్సి ఉంటుంది.