చైనాకు చెందిన మొబైల్స్ తయారీదారు షియోమీ ఫోన్లను వాడుతున్న వారికి కేంద్రం షాకిచ్చింది. ఆయా ఫోన్లలో ఉండే షియోమీ డెవలప్ చేసిన ఇంటర్నెట్ బ్రౌజర్ యాప్‌ను కేంద్రం నిషేధించింది. ఇప్పటికే 59 చైనీస్ యాప్‌లను నిషేధించిన కేంద్రం ఇంకా యూజర్లు వాడుతున్న అనేక యాప్‌లపై దృష్టి పెట్టింది. అందులో భాగంగానే షియోమీ ఫోన్లలో ఉండే బ్రౌజర్ యాప్‌ను నిషేధిస్తున్నట్లు ప్రకటించింది.
షియోమీ ఫోన్లలో ఉండే ఎంఐ బ్రౌజర్ ప్రొ – వీడియో డౌన్‌లోడ్, ఫ్రీ ఫాస్ట్ అండ్ సెక్యూర్ యాప్‌ను కేంద్రం నిషేధించింది. దీని వల్ల ఫోన్ల పనితీరు మందగిస్తుందని నిపుణులు పేర్కొన్నారు. అయితే ఈ విషయంపై తాము కేంద్ర ప్రభుత్వంతో చర్చిస్తున్నామని షియోమీ తెలిపింది. కాగా దేశంలో ఇప్పటికే షియోమీకి చెందిన 10 కోట్లకు పైగా ఫోన్లను యూజర్లు వాడుతున్నారు. దాదాపుగా వాటన్నింటిలోనూ ఈ బ్రౌజర్ యాప్ ఉంది. కాగా షియోమీకి చెందిన ఎంఐ కమ్యూనిటీ యాప్‌ను కూడా ఇది వరకే భారత ప్రభుత్వం నిషేధించింది.
ఇక ఈ విషయంపై షియోమీ స్పందిస్తూ.. ఎంఐ బ్రౌజర్ యాప్ ద్వారా వినియోగదారుల డేటాను సేకరించడం లేదని, వారి డేటాకు పూర్తి ప్రైవసీ, భద్రత ఉంటాయని తెలిపింది. అలాగే ఈ విషయంపై సంబంధిత అధికారులతో చర్చిస్తున్నామని తెలిపింది.