వాట్సాప్” ప్రపంచ వ్యాప్తంగా దీని వాడకం ఎలా ఉందో తెలియదు గాని భారత్ లో మాత్రం వాట్సాప్ కోసం ఫోన్లు, వాట్సాప్ కోసం ఇంటికి వైఫైలు ఏర్పాటు చేసుకునే పరిస్థితి ఉంది. వంటింటి నుంచి ఆఫీస్ వరకు, పడక గది నుంచి వ్యాపారం వరకు, ఆటో నుంచి విమానం వరకు ఇలా ఎక్కడ చూసినా సరే వాట్సాప్ లేకుండా పని జరగడం లేదు అనేది నిజం. సోషల్ మీడియాలో అత్యంత విజయవంతమైన మాధ్యమంగా పేరున్న వాట్సాప్ ని ఇప్పుడు ప్రభుత్వ౦ కూడా వినియోగించే పరిస్థితి ఉందీ అంటే దీని వాడకం ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు.
అయితే ఇప్పుడు ఈ సంస్థకు ఒక కష్టం వచ్చి పడింది. దీనిని భారత ప్రభుత్వం నిషేధించే అవకాశం ఉందనే వార్తలు ఇప్పుడు వినియోగదారులను కలవరానికి గురి చేస్తున్నాయి. పెగాసస్ హ్యాకింగ్ ఘటన వాట్సాప్ కి పెద్ద తలనొప్పిగా మారింది. ఈ విషయంలో భారత ప్రభుత్వం జూన్ నుంచి ఈ నెల వరకు పలు మార్లు సంప్రదింపులు, చర్చలు జరిపినా… ఎలాంటి వివరాలు వెల్లడించడం లేదు. వాట్సాప్ మేసేజ్స్ లో వివాదాస్పద సందేశాలను సృష్టించిన వారిని కనిపెట్టడం సహా ప్రభుత్వం జవాబుదారీతనంపై ఎలాంటి నిబంధనలు తీసుకురాకుండా ఉండేందుకే స్పందించడం లేదని సమాచారం.
ఇక ఇప్పుడు ఈ సంస్థపై కేంద్రం అసహనం వ్యక్తం చేస్తుంది. ఫేస్బుక్ అనుబంధ సంస్థ అయిన వాట్సాప్ కి ఒక్క భారత్ లోనే 40 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. ఈ నేపధ్యంలో ప్రభుత్వం వివాదాస్పద సందేశాలను పంపించే వారిని కనిపెట్టేలా సహకరించాలని సంస్థను కోరినా సరే ఫలితం లేకపోయింది. వాట్సాప్ లో సందేశాలు మూకహత్యలకు దారి తీయడంతో కేంద్రం ఆగ్రహంగా ఉంది. ఈ నేపధ్యంలో తాము చెప్పినట్టు వాట్సాప్ వినకపోతే మాత్రం భారత్ లో నిషేధించడానికి అయినా సరే కేంద్రం వెనకడుగు వేయదని ప్రభుత్వ వర్గాలు అంటున్నారు. వాట్సాప్ విషయంలో కేంద్రం ఎలాంటి వైఖరి అనుసరిస్తుందో అనే ఆసక్తి ఇతర సామాజిక మాధ్యమాల్లో నెలకొంది.