పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో పార్లమెంట్‌కు వచ్చే ప్రజా ప్రతినిధులు, నేతలతోపాటు వారి సిబ్బంది కూడా అక్కడి క్యాంటీన్‌లో సబ్సిడీపై అందించే భోజనం చేస్తారని తెలిసిందే. భోజనమే కాకుండా, స్నాక్స్, ఇతర ఆహారాలను కూడా తక్కువ ధరలకే గతంలో అందించేవారు. కానీ ఇకపై పార్లమెంట్ క్యాంటీన్‌లో ఆహార పదార్థాలపై సబ్సిడీ ఉండదని, అసలు ధరలకే విక్రయిస్తామని, సబ్సిడీని ఎత్తి వేస్తున్నామని ఇది వరకే స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. చెప్పినట్లుగానే ప్రస్తుతం సబ్సిడీని ఎత్తి వేశారు. ఇక ఆహార పదార్థాలకు చెందిన ధరలను కూడా నిర్ణయించారు.
పార్లమెంట్ క్యాంటీన్‌లో ఇక శాకాహార భోజనం అయితే రూ.100 చెల్లించాలి. అదే ఉడకబెట్టిన కూరగాయలను గతంలో రూ.12కు ఇచ్చేవారు. ఇప్పుడు రూ.50 చెల్లించాలి. హైదరాబాద్ మటన్ బిర్యానీ ధర రూ.65 ఉండేది. ఇప్పుడు దాని ధరను రూ.150కి పెంచారు. చపాతీ ధర రూ.3 గానే ఉంది. నాన్ వెజ్ బఫె చేయాలంటే ప్రస్తుతం రూ.700 చెల్లించాలి. అదే వెజ్ బఫె అయితే రూ.500 కట్టాలి. ఈ క్రమంలో సబ్సిడీ ఎత్తి వేయడం వల్ల ఏడాదికి రూ.8కోట్ల వరకు ఆదా అవుతుందని కేంద్రం అంచనా వేస్తోంది.
కాగా పెరిగిన కొత్త ధరలు జనవరి 29వ తేదీ నుంచి అమలులోకి వస్తాయి. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి బడ్జెట్ సమావేశాలు జరగనున్న విషయం విదితమే. అందులో భాగంగానే పార్లమెంట్ క్యాంటీన్‌లో కొత్త ధరల ప్రకారం ఆహార పదార్థాలను విక్రయిస్తారు. ఇక ఇండియా టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో పార్లమెంట్ క్యాంటీన్‌ను నిర్వహిస్తారు.