టిక్‌టాక్ బ్యాన్‌.. పండ‌గ చేసుకుంటున్న భార‌తీయులు..!

-

టిక్ టాక్..! దీన్ని ఏ ముహూర్తాన ఆ చైనా వాడు కనిపెట్టాడో గానీ.. ఆ దేశంలో కన్నా మన దగ్గరే దీన్ని ఎక్కువ మంది ఉపయోగించడం మొదలుపెట్టారు. నిత్యం వీడియోలు తీసుకుంటూ కొందరు టైమ్ పాస్‌ కోసం టిక్‌టాక్‌ను వాడుతుంటే.. ఇంకొందరు మాత్రం అందులో సీరియస్‌గా వీడియోలు పెట్టడం మొదలు పెట్టారు. ఇక కొంత మందికైతే అదే లోకమైంది. ఈ యాప్‌ మోజులో పడి జీవితాలనే నాశనం చేసుకుంటున్న వారు కూడా ఉన్నారు. దీని వల్ల కొంత మంది ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాగే దీని వల్ల విడిపోయిన కుటుంబాలు కూడా ఉన్నాయి.  అయితే ఇప్పుడు టిక్ టాక్‌పై కేంద్రం నిషేధం విధించడంతో.. ఒక్కసారిగా ఈ యాప్‌ను వాడుతున్న వారికి షాక్‌ కొట్టింది. వారికి దిమ్మ తిరిగి బొమ్మ కనబడింది..

లేకపోతే.. ఎప్పుడు చూడు.. ఎవడ్ని చూడు.. టిక్‌టాకే.. చేతిలో ఓ డబ్బా ఫోన్‌ పట్టుకుని ప్రతి ఒక్కడూ వీడియోలు చేసి అందులో పెట్టేవాడే. మళ్లీ అలాంటి వారికి టిక్‌టాక్‌ స్టార్స్‌ అని పేర్లు.. వాళ్లేదో సెలబ్రిటీలు అయినట్లు బిల్డప్పు.. ఇలాంటి వాళ్ల గోలతో ఇన్నాళ్లూ తల బొప్పి కట్టింది. అసలు స్మార్ట్‌ఫోన్‌ను ఎందుకు కనిపెట్టార్రా బాబూ.. కనిపెడితే పెట్టారు.. ఈ టిక్‌టాక్‌ రచ్చ ఏమిటి ? అని చాలా మంది తీవ్రమైన అసహనం వ్యక్తం చేశారు. అయితే వారంతా ఇప్పుడు ఊపిరి పీల్చుకుంటున్నారు.

నిజానికి టిక్ టాక్‌ను నిషేధించాలని చాలా కాలంగా డిమాండ్ ఉంది. ఆ మధ్య ఆ యాప్‌లో అసభ్యకరమైన వీడియోలు పెడుతున్నారని.. పిల్లలు వాటిని చూస్తున్నారని మద్రాస్‌ హైకోర్టులో కేసు వేశారు. దీంతో టిక్‌టాక్‌ను కొద్ది రోజుల పాటు బ్యాన్‌ చేశారు. అయితే ఈ యాప్‌ డెవలపర్లు నానా తంటాలు పడీ.. అలాంటి వీడియోలను తొలగించి.. బాబ్బాబూ.. ఇంక అలాంటి వీడియోలకు అందులో చోటివ్వం.. మాకు ఇంకో చాన్సివ్వండి.. అంటూ బతిమాలి.. మళ్లీ పర్మిషన్‌ తెచ్చుకుని యాప్‌ను రీ లాంచ్‌ చేశారు. అయితే ఇప్పుడు తగిలిన షాక్‌ అల్లాటప్పా కాదు. కనుక టిక్‌టాక్‌ డెవలపర్లు కింద, మీద అన్నీ మూసుకుని గప్‌ చుప్‌గా ఉండాల్సిందే. కేంద్రం దయతలచి బ్యాన్‌ను ఎత్తేస్తే సరి. లేకపోతే టిక్‌టాక్‌కు మూడినట్లే..

అయితే టిక్‌టాక్‌ను నిషేధించిన నేపథ్యంలో సోషల్ మీడియాలో ఈ యాప్‌పై నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. అయ్యో మా జీవితాలను నాశనం చేశారంటూ కొందరు పనీపాటా లేని టిక్‌టాకర్లు లబో దిబోమంటుంటే..  మెజారిటీ యూజర్లు మాత్రం టిక్‌టాక్‌ను బ్యాన్‌ చేసినందుకు ఎంతో సంబర పడుతున్నారు.  ఇన్ని రోజులూ టిక్‌టాక్‌ పట్ల వారు అనుభవించిన అస‌హ‌నం, విసుగు, చిరాకు ఇకపై ఉండనందుకు సంబరాలు చేసుకుంటున్నారు. ఎట్టకేలకు టిక్‌టాక్‌ పీడ విరగడయిందిరా బాబూ.. అంటూ సంతోషం పట్టలేకపోతున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో టిక్‌టాక్‌ బ్యాన్‌పై జోకులు పేలుతున్నాయి. నెటిజన్లు వాటిని ఆస్వాదిస్తున్నారు. అసలు ఈ టిక్‌టాక్ అనేది కరోనా కన్నా డేంజర్ అని.. ఇక దీని పీడ ఎట్టకేలకు విరగడైందని చాలా మంది హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news