పబ్లిక్ ప్లేసుల్లో మనకు ఎక్కువగా కనిపించేది.. అపరిశుభ్రతే.. అందులో ముఖ్యంగా వృథాగా పోతున్న నీరు, ఎక్కడంటే అక్కడ తినిపడేసిన కవర్లు, ఊసేసిన పాన్ మరకలు.. వీటిని క్లీన్ చేయడానికి ప్రభుత్వం కొన్ని వందల కోట్లు ఖర్చుపెడుతుంది. అయినా ఆశించినంత ఫలితం ఉండటం లేదు. ఎక్కడ చూసిన పాన్ మరకలు.. ఆ అమ్మాయి మనసును కలిచివేసింది. ప్రకృతి ప్రేమికులను ఇలాంటి మరకలను చూస్తే చాలా బాధగా అనిపిస్తుంది.. అలాగే ఈ అమ్మాయికి కూడా అనపించింది.. అయితే కాసేపు బాధపడి ఊరుకోలేదు. ఆలోచించింది.. అలా ఆలోచనలోనుంచి వచ్చిన ఐడియానే ఇప్పుడు దేశవ్యాప్తంగా పాకింది.. ఒక సంస్థను ప్రారంభించి.. ఎంతో స్పూర్తిగా దాయకంగా నిలిచిన నాగ్‌పుర్ అమ్మాయి రీతూ మల్హోత్ర స్ఫూర్తి కథనమిది…
రీతూ ఇంజినీరింగ్ చదివేటప్పుడు తన కాలేజీ ప్రాంగణమే కాదు, రహదారుల్లో ఎక్కడ చూసినా ఉమ్మి మరకలే ఎక్కువగా కనిపించేవి. దీంతో ప్రభావితమయ్యేవి పరిశుభ్రత, పర్యావరణమే కాదు.. ఇతరులకూ శ్వాససంబంధిత సమస్యలు, చికిత్సకు లొంగని అనారోగ్యాలనూ ఇది తెచ్చిపెడుతుందని ఏదైనా చేయాలనుకుంది.. ముందునుంచే.. సాంకేతికతపై ఆసక్తి ఉన్న ఆమె.. ఎంత పెద్ద సమస్యనైనా చిన్న సాంకేతికతతో పరిష్కారం చూపొచ్చని నమ్ముతుంది.
అలా ఆమెకు వచ్చిన ఆలోచనే ‘ఈజీ స్పిట్’. దీని ద్వారా ఉమ్మి మరకలు కనిపించకుండా చేయాలనుకుంది. ‘మన దేశంలో పర్యటించే విదేశీయులు పాన్ మరకల్నీ చూసి చాలా అసౌకర్యానికి గురవుతారు. బహిరంగంగా ఉమ్మడాన్ని కేంద్ర ప్రభుత్వం నిషేధించినా, దాన్ని ఎవరూ అసలు పాటించడం లేదు. వీటిని శుభ్రం చేయడానికి కోట్లలో డబ్బు ఖర్చు.. లక్షలాది లీటర్ల నీరు వృథా అవుతోంది. ఈ నీరు ఇంకి భూగర్భజలాలు కూడా కలుషితమవుతున్నాయి. మూత్ర విసర్జన కోసం ఎక్కడికక్కడ ప్రత్యేకంగా మూత్రశాలలున్నాయి. ధూమపానానికి స్మోకింగ్ జోన్స్ ఉన్నాయి. అలాగే ఈ సమస్యకూ ప్రపంచవ్యాప్తంగా ఓ పరిష్కారాన్ని కనిపెట్టాలనిపించింది.
2016లో పరిశోధన ప్రారంభించి చాలా ప్రాంతాలు తిరిగి సర్వే చేపట్టింది… అలా 2019, అక్టోబరులో ‘ఈజీ స్పిట్’ను ప్రారంభించి కొన్ని ఉత్పత్తులు తీసుకొచ్చారు.. దాంతోపాటు ‘థూక్‌మత్’ (ఉమ్మి వేయొద్దు) ప్రచారగీతంతో అవగాహన మొదలుపెట్టారు. 2020, జనవరిలో తయారీ యూనిట్‌ను ప్రారంభించారు… ఇందుకోసం కొన్ని సంస్థలు ముందుకొచ్చి ప్రోత్సాహాన్ని కూడా అందించాయి. ముందుగా కాగితంలో ప్రత్యేక పద్ధతిలో విత్తనాలను పొందుపరిచి, తర్వాత ఆ కాగితంతో కవర్లు, గ్లాసుల్లాంటివి తయారుచేశారట.. దీన్ని ‘స్పిట్టూన్’లా వినియోగించుకోవచ్చు. అలాగే ఇవి మట్టిలో తేలికగా కలిసిపోతాయి.
పాన్ అలవాటున్నవారు బయటికి వెళ్లేటప్పుడు ఈ కవరును జేబులో ఉంచుకుంటే ఉమ్మాలనుకున్నప్పుడు వినియోగించి పడేయొచ్చు. ఆ కవరు తయారీలో వాడిన విత్తనాలు మొలకెత్తుతాయి. అలాగే ఆఫీసులూ, ఇతర ప్రదేశాల్లో ఉన్నవారికి గ్లాసు ఆకారంలో తయారుచేసిన స్పిట్టూన్ ఉపయోగపడుతుంది. ఇలా చేస్తే పరిసరాల పరిశుభ్రతతోపాటు పర్యావరణాన్ని పరిరక్షించుకోవచ్చు’ అంటోంది.. రీతూ.
రైల్వేస్టేషన్లలో ప్రపంచంలోనే తొలి రీయూజబుల్ మొబైల్ స్పిట్టూన్‌గా నిలిచిన ‘ఈజీ స్పిట్’ స్టార్టప్ ప్రముఖుల ప్రశంసలెన్నో అందుకుంది. దిల్లీ, బిహార్, ఝార్ఖండ్, మధ్యప్రదేశ్, పంజాబ్, ఉత్తర్‌ప్రదేశ్, తమిళనాడు, గుజరాత్, హరియాణా తదితర రాష్ట్రాల్లో ఈ తరహా స్పిటూన్ల వినియోగాన్ని ప్రజలకు దగ్గరకు చేరుస్తోంది రీతూ.
రైల్వేశాఖ కూడా ఈ స్పిట్టూన్స్ వినియోగాన్ని ప్రజలకు చేర్చడానికి ముందుకొచ్చింది. రైల్వేస్టేషన్లలో వీటిని పెడుతోంది. అలాగే ప్రముఖ సంస్థలు కొన్ని ముందుకొచ్చి తమ సిబ్బంది వీటిని వినియోగించేలా చేస్తున్నాయి. పర్యావరణ పరిరక్షణ కోసం కృషిచేస్తున్న రీతూను ఐక్యరాజ్యసమితి అవార్డుతో గౌరవించటం విశేషం. గతేడాది ఫోర్బ్స్ ఇండియా, ఫోర్బ్స్ ఆసియా ‘30 అండర్ 30’ లోనూ ఈమె స్థానాన్ని దక్కించుకుంది.
పరిశుభ్రత, పర్యావరణంపై అవగాహన కలిగిస్తున్న ఈ స్టార్టప్‌కు బాలీవుడ్ నటుడు సునీల్‌శెట్టి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. మానవ లాలాజలంలో ఉండే బ్యాక్టీరియా, వైరస్‌లను నశింపజేసే ప్రత్యేక పదార్థంతోపాటు మ్యాక్రోమాలిక్యూల్ పల్ప్ టెక్నాలజీతో తయారైన ఉత్పత్తుల్ని తెచ్చిన ‘ఈజీ స్పిట్’కు గానూ రీతూ ‘గ్లోబల్ బయో-ఇండియా సమ్మిట్ 2019’లో ఉమెన్ ఆంత్రప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు, రూ.25 లక్షలు నగదు బహుమతి దక్కించుకుంది.
యువత తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతారని ఈ అమ్మాయి మరోసారి నిరూపించింది.