కాంగ్రెస్ మీటింగ్ అంటే చర్చ కంటే రచ్చే ఎక్కువ. సమావేశం ఎజెండా ఒకటైతే, మరో అంశంమీద డిస్కషన్ నడుస్తూ ఉంటుంది. కానీ, ఇప్పుడా పరిస్థితి కనిపించటం లేదు ఇంఛార్జి ఠాగూర్ ముందు నేతల ధోరణిలో మార్పు తప్పటం లేదట. ఎంత సీనియర్ నాయకులైనా, టాపిక్ డైవర్ట్ అయితే మైక్ కట్ చేస్తున్నారట.
గాంధీభవన్ లో దుబ్బాక ఎన్నికల మీద జరిగిన సమావేశంలో కొన్ని ఆసక్తికర సంఘటనలు జరీగాయి. ఓ సీనియర్ నాయకుడు … గ్రేటర్ ఎన్నికల సంగతి ఏంటి..? గ్రాడ్యుయేట్ ఎన్నికల సంగతి ఏంటి..? అని అడిగారట. ఇంఛార్జి జోక్యం చేసుకుని… దుబ్బాక గురించి సమావేశం నడుస్తోది. దాని గురించే మాట్లాడండి అని తేల్చేశారట. ఇంతలో మరో సీనియర్ నాయకుడు నేనేంటి… నాకు గ్రామ బాధ్యత అప్పగించడమేంటి అన్నారట. ఈ విషయానికి ఇంచార్జ్ వరకు ఎందుకు అనుకున్నారేమో.. పీసీసీ చీఫ్ ఉత్తమ్ జోక్యం చేసుకుని, అన్నా మీరు మండలం చూసుకోండి.. నేను మీకు అప్పగించిన గ్రామం చూసుకుంటా అని చెప్పి డిస్కషన్ పెరక్కుండా చూశారట.
ఏ డిస్కషన్ అయినా, అసలు విషయం తప్ప, మరోటి చర్చకు రాకుండా చూస్తున్నారట. ఎన్నికల ఖర్చుల మీద కూడా కొందరు నాయకులు అడిగిన ప్రశ్నలకు…ఠాగూర్….ఎవరికి అప్పగించిన గ్రామంలో వాళ్లే చూసుకోండి అన్నాటర. గ్రామానికి రెండు..మూడు లక్షల కంటే ఎక్కువ ఖర్చవుతుందా? వాటిని కూడా భరించలేరా..? అని ప్రశ్నించారట. ఎన్నికల్లో ఓడిపోతే… మీకే నష్టం… నాకేం ఇబ్బంది లేదు. ఓడిపోతే వెళ్లి నేను మళ్ళీ ఎంపీ గా పోటీ చేసుకుంటా…? అని కొంత ఘాటుగానే చెప్తున్నారు.
నిజానికి కొత్తగా వచ్చిన నాయకునికి అంతా దగ్గరవ్వాలని చూస్తారు. కానీ… రెండు వారాలుగా… ఇంఛార్జి ఠాగూర్ ఎవరిని దగ్గరకు రానివ్వడం లేదట. మీడియా తో మాట్లాడుతున్నట్టుగానే పార్టీ అంతర్గత సమావేశాల్లో కూడా.. నాయకులకు నేరుగా సమవ్యయం గురించే చెప్తున్నారట. ఇవన్నీ చూస్తున్న నాయకులకు… ఓ అనుమానం వచ్చేస్తుందట. ఏ నాయకుడికి ఎవరితో కయ్యం… ఎవరెవరు…ఏ గ్రూప్ అనేది ముందే తెలుసుకుని రాష్ట్రానికి వచ్చినట్టుందని చెప్పుకుంటున్నారు. దీనికి తోడు పదే పదే అధిష్టానం నాకు కొన్ని బాధ్యతలు ఆప్పగించింది. దాన్ని పూర్తి చేసి వెళ్తా అనడం కూడా నాయకుల్లో టెన్షన్ కు కారణమౌతోంది.
అధిష్టానం అందరి జాతకాలు చెప్పి పంపిందా..అనే సందేహంలో పడ్డారట సీనియర్ నేతలు. మొత్తానికి ఠాగూర్ మనసులో ఏముందో అని నేతలు అంచనా వేయలేక సతమతమౌతున్నారట.