అయోధ్య వివాదం ఎలా మొద‌లైంది… ఎక్క‌డ నుంచి ఎక్క‌డ..!

-

అయోధ్యలోని రామ జన్మభూమి, బాబ్రీ మసీదు భూ యాజమాన్య వివాదంపై నేడు తుది తీర్పు వెలువడనున్న నేప‌థ్యంలో అంత‌టా హైటెన్ష‌న్ నెల‌కొంది. ఈరోజు ఉదయం 10.30గం.ల‌కు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఈ కేసులో కీలక తీర్పును వెల్ల‌డించ‌నున్న‌ది. దీనికి సంబంధించిన నోటీసును శుక్రవారం రాత్రి సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేశారు. సుప్రీంకోర్టు చరిత్రలో రికార్డు స్థాయిలో దాదాపు 40 రోజుల పాటు క్రమం తప్పకుండా ఈ కేసు విచారణ కొనసాగింది. అక్టోబర్‌ 16న వాదనలు వినడం ముగించిన జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డే, జస్టిస్‌ డీవై చంద్రచూడ్, జస్టిస్‌ అశోక్‌భూషణ్, జస్టిస్‌ ఎస్‌ఏ నజీర్‌ కూడా సభ్యులుగా ఉన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్‌లో ఉంచింది.

తీర్పు నేపథ్యంలో దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ప్ర‌ధానంగా హైద‌రాబాద్ అంత‌టా, ముఖ్యంగా పాత‌బ‌స్తీ, ముస్లీంలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట భద్రతా చర్యలు చేపట్టారు. 1950లో మొద‌లైన ఈ కేసు క్ర‌మ‌క్ర‌మంగా ఇప్ప‌టి వ‌ర‌కు సాగుతూనే ఉంది. 1959లో ఒక‌సారి, 1961లో మ‌రోసారి, 1989లో లోనూ కేసులు వేశారు. చివ‌రికి బాబ్రీ మసీదు నిర్మాణం 1992 డిసెంబర్‌ 6వ తేదీన కూల్చివేతకు గురైంది. దాంతో, దేశవ్యాప్తంగా తీవ్రస్థాయిలో మతకలహాలు చోటు చేసుకున్నాయి. 1950 నుంచి న‌డుస్తున్న కేసుల‌న్నీ అల‌హాబాద్ హైకోర్టుకు బ‌దిలీ అయ్యాయి.

అలహాబాద్‌ హైకోర్టు వివాదాస్పద 2.77 ఎకరాల స్థలాన్ని రామ్‌లల్లా, సున్నీ వక్ఫ్‌ బోర్డ్, నిర్మోహి అఖాడాలకు సమానంగా పంచుతూ 2010లో తీర్పును ప్రకటించింది. ఆ తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో 14 పిటిషన్లు దాఖలయ్యాయి. ఆ తరువాత ఈ సమస్య పరిష్కారానికి ఆధ్యాత్మిక గురు, ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు పండిట్‌ శ్రీశ్రీ రవిశంకర్, జస్టిస్‌ కలీఫుల్లా, సీనియర్‌ న్యాయవాది శ్రీరామ్‌ పంచు సభ్యులుగా ఒక మధ్యవర్తిత్వ కమిటీ ఏర్పడింది.

వివిధ వర్గాలతో నాలుగు నెలల పాటు ఆ కమిటీ సంప్రదింపులు జరిపింది. కానీ స‌మ‌స్య ప‌రిష్కారం కాలేదు. దీంతో సుప్రీంకోర్టు ఈ ఏడాది ఆగ‌స్టు 6వ తేదీ నుంచి ప్ర‌తిరోజు విచార‌ణ జ‌రిప‌డం ప్రారంభించింది. వ‌రుస‌గా ఇప్ప‌టి వ‌ర‌కు విచార‌ణ జ‌రుపుతున్న సుప్రీంకోర్టు జ‌స్టీస్ రంజ‌న్ గ‌గోయ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధ‌ర్మాసం అక్టోబ‌ర్ 16న విచార‌ణ ముగించింది. బాబ్రీమ‌సీదు కేసు 69ఏండ్లుగా కొన‌సాగి ఈరోజు తీర్పు రానున్న‌ది.

అయితే గతంలో అయోధ్య ఘటన సమయంలో తలెత్తిన పరిస్థితుల దృష్ట్యా హైదరాబాద్‌ వ్యాప్తంగా నిఘా, గస్తీ ముమ్మరం చేశారు. పాతబస్తీ, పరిసర ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించారు. రాజధానిలోని మూడు కమిషనరేట్ల పరిధిలో అప్రకటిత నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నారు. ఎక్క‌డైనా నలుగురి కంటే ఎక్కువ మంది ఒకచోట గుమికూడాద‌ని ఆదేశాలు జారీ అయ్యాయి. కేంద్ర నిఘా సంస్థలు, కేంద్ర హోంశాఖ ఇచ్చిన‌ ఆదేశాలతో ఎలాంటి చిన్న సంఘటన జరగకుండా పోలీసులు పకడ్బందీగా, కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. అవసరమైతే.. రాష్ట్ర పోలీసు బలగాలకు తోడుగా.. కేంద్రం నుంచి అదనపు బలగాలను తెప్పించే యోచనలో ఉన్నారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్ర‌తి ప్రాంతంలో గ‌ట్టినిఘాను ఏర్పాటు చేసింది పోలీసు శాఖ‌. తీర్పును ప్ర‌తి ఒక్క‌రు గౌర‌వించాల‌ని, ఎలాంటి వ్య‌తిరేక‌, మ‌త విద్వేశాలు రెచ్చ‌గొట్టే ప్ర‌క‌ట‌న‌లు చేయ‌రాద‌ని పోలీసు శాఖ సోష‌ల్ మీడియాలోనూ, మీడియాలోనూ, వాట్స‌ప్‌, ట్వీట్ట‌ర్‌, ఇన్‌స్ట్రాగ్రామ్‌ల‌తో పాటు అవ‌కాశం ఉన్న ప్ర‌తిదాన్ని ఉప‌యోగించి ప్ర‌చారం చేస్తున్నారు. తీర్పుపై కామెంట్లు చేసినా చ‌ట్ట‌రీత్యా చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని పోలీసులు ముమ్మ‌ర ప్ర‌చారం చేస్తున్నారు. ప్ర‌ధాన కూడ‌ళ్ళ‌లో బందోబ‌స్తును ఏర్పాటు చేసి, ప‌టిష్ట‌మైన నిఘాను ఉంచారు. దీంతో అంత‌టా హైటెన్ష‌న్ వాతావ‌ర‌ణం క‌నిపిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news