ఏపీలో వైసీపీ దెబ్బతో ప్రధాన ప్రతిపక్షం అయిన టీడీపీయే కుదేలవుతోంది. ఆరు నెలల్లోనే జగన్ ఎవ్వరూ ఊహించని నిర్ణయాలతో సంచలనాల మీద సంచలనాలు క్రియేట్ చేస్తూ దూసుకుపోతున్నాడు. వైసీపీ దూకుడుతో అటు ప్రధాన ప్రతిపక్షం అయిన టీడీపీయే కోలుకోలేక విలవిల్లాడుతోన్న పరిస్థితి. ఆ పార్టీకి చెందిన కీలక నేతలు జగన్ దూకుడు చూసి వచ్చే ఐదేళ్ల తర్వాత కూడా తమ పార్టీకి భవిష్యత్తు ఉంటుందన్న నమ్మకాలు లేక అయితే వైసీపీయో లేదా బీజేపీయో అన్నట్టు తమ దారి తాము చూసుకుంటున్నారు.
ఇదిలా ఉంటే జగన్ దెబ్బకు పవన్‌కళ్యాణ్ జనసేన అయితే తీవ్రంగా విలవిల్లాడుతోంది. అసలు ఆ పార్టీలో పవన్ సైతం ఎవరిని నమ్మే పరిస్థితి లేదని తెలుస్తోంది. పలువురు కీలక నేతలు పార్టీలోనే ఉంటూ పార్టీ అంతర్గత విషయాలను ఇతర పార్టీల వారికో లేదా మీడియాకో లీకులు చేస్తున్నట్టు పవన్‌కు నివేదికలు చేరాయట. దీంతో అసలే పార్టీలో ఉన్న కొద్దిమంది నేతల్లోనే ఎవరిని నమ్మాలో ? ఎవరిని నమ్మకూడదో తెలియక సతమతమవుతున్నట్టు తెలుస్తోంది.
ఇక ఆ పార్టీకి చెందిన ఒక్కగానొక్క ఎమ్మెల్యేను సైతం పవన్ నమ్మే పరిస్థితి లేదంటున్నారు. రాపాక వరప్రసాద్ అంటే వైఎస్ ఫ్యామిలీకి వీర విధేయుడు. ఆయన వైఎస్ దయతోనే 2009లో రాజోలులో ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక ఈ యేడాది ఎన్నికలకు ముందు కూడా జగన్ ఆయనకు సీటు ఇవ్వలేనని చెప్పడంతో జనసేనలో చేరి ఆ పార్టీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యేగా మిగిలిపోయారు. ఇక రాపాక గెలిచినప్పటి నుంచి జగన్, వైసీసీ నామస్మరణ చేస్తుండడంతో జనసేన వర్గాలు సైతం అతడిని నమ్మడం లేదు.
చివరకు మొన్న ఎన్నికల్లో రాపాకను గెలిపించిన నేతలు అందరూ ఇప్పటికే వైసీపీలో చేరిపోయారు. మరోవైపు స్థానిక జనససేన నాయకత్వం మాత్రం రాపాకను విమర్శిస్తోంది. ఫ్లెక్సీల్లోనూ ఆయన ఫొటోలు లేకుండా పెడుతున్నారు. ఇక పవన్ సైతం ఆయన్ను నమ్మడం లేదని.. ఆయన్ను నమ్మితే పార్టీ కీలక విషయాలు బయటకు వెళ్లిపోతున్నాయని అసహనంతో ఉన్నారట. అందుకే జనసేనలో ఆయనకు పెద్దగా గౌరవం దక్కడం లేదన్న ప్రచారం ఉంది.
పార్టీ తరపున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే అయినా పార్టీ అధినేత నుంచి… అక్కడ కీలంగా ఉన్న నేతలు సహా ఎవ్వరూ పట్టించుకోకపోవడంతోనే ఆయనకు పార్టీకి దూరం పెరిగిందంటున్నారు. ఇక పార్టీలో కీలక కమిటీల్లో ఉన్నవారు సైతం కొందరు ఇంటర్నల్ మ్యాటర్లను లీక్ చేస్తున్నారట. ప్రస్తుతం ఈ అంశంపై జనసేనలో పొగలు సెగలు రేపుతున్నాయని.. ఎవ్వరూ ఎవ్వరిని నమ్మడం లేదంటున్నారు. చివరకు పవన్ సైతం ఎవరిని నమ్మాలో ? తెలియని పరిస్థితిలో ఉన్నట్టు టాక్..!