‘‘ ఆచార్య’’కు కాజల్‌ మైనస్‌ పాయింటా..?

-

‘‘ఖైదీ నెం.150’’ లో ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టిన ఈ జంటను మళ్లీ చూడాలంటే జనాలు చాలాచాలా ఇబ్బంది పడాల్సివస్తుంది.

మెగాస్టార్‌ చిరంజీవి 152వ సినిమాగా ‘‘ ఆచార్య ’’ రానుంది. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ ఈ చిత్రానికి మెగాఫోన్‌ చేపట్టాడు. సామాజిక స్పృహ నేపథ్యంలో మాస్‌ సినిమాలు తీయడంలో సిద్ధహస్తుడైన శివ, మెగాస్టార్‌ను ఎలా చూపించనున్నాడోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఈ సినిమాలో ముందుగా త్రిషను కథానాయికగా తీసుకున్నారు. ఏమైందో ఏమో గానీ, త్రిషను కాజల్‌ అగర్వాల్‌ రీప్లేస్‌ చేసింది.

మెగాస్టార్‌ 150వ సినిమా… ‘‘ ఖైదీ నెం.150 ’’…. తమిళ ‘కత్తి’ కి రీమేక్‌. హీరోయిన్‌గా ఎవరిని సంప్రదించినా, నో అన్న సమాధానమే. చివరికి నిర్మాత రామ్‌చరణ్‌కు మంచి ఫ్రెండ్‌ అయిన కాజల్‌ అగర్వాల్‌ను ఒప్పించగలిగారు. అదీ తను అడినంత రెమ్యునరేషన్‌ ఇచ్చి.

151 వ చిత్రం –  ‘సైరా’… ఇక్కడా అదే సమస్య.. నయనతారను కథానాయికగా తీసుకున్నారు. ఇంకో హీరోయిన్‌గా తమన్నా… సేమ్‌ ఓల్డ్‌ కండిషన్స్‌.. ఓ దశలో నయనతార తప్పుకునే పరిస్థితి. మళ్లీ బతిమిలాడి(?), దార్లోకి తెచ్చుకున్నారు.  ఇప్పుడు ఆచార్య.. హీరోయిన్లు కరువు.

కాజల్‌ అగర్వాల్‌… 34 యేళ్ల ఈ కథానాయిక, తెలుగు తెరపై తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. ‘లక్ష్మీ కళ్యాణం’తో తెరంగేట్రం చేసి, ‘చందమామ ’తో తొలి హిట్‌ అందుకుంది. 5వ సినిమాగా 2009లో విడుదలైన ‘మగధీర’ తో ఇక వెనక్కి తిరిగిచూసుకోవాల్సిన అవసరం రాలేదు. దాదాపు అందరు యువ కథానాయకులతో, అగ్ర హీరోలతో నటించి, మెప్పించింది. ప్రముఖ యువ కథానాయకుడు రామ్‌చరణ్‌తో మూడు సినిమాలలో హీరోయిన్‌గా నటించింది. ఈ జంట మంచి కెమిస్ట్రీని పండించి, హిట్‌ పెయిర్‌ అనిపించుకుంది. కాజల్‌ మెగా కాంపౌండ్‌లోని అందరు అగ్ర హీరోలతో నటించింది. మరపురాని అందం, మంచి నటనతో అందరి మన్ననా చూరగొంది.

దాదాపు 11 యేళ్ల పాటు తెలుగు చలనచిత్ర రంగాన్ని ఏలిన కథానాయికగా పేరుగాంచిన కాజల్‌కు ఈ మధ్య అవకాశాలు తగ్గిపోయాయి. వయస్సు పెరిగిపోతుండడం, అందరూ చిన్న హీరోలు రావడంతో మార్కెట్‌ తగ్గిపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో చిరంజీవి సరసన అవకాశం రావడంతో ఆనందానికి హద్దుల్లేకుండా పోయింది. పైగా కోరినంత పైకం. ఇంకేం… అలా ‘ఖైదీ….’ సెట్‌ అయింది. సరిగ్గా అదే ఇప్పుడూ రిపీట్ అయింది.

సీనియర్‌ హీరోలయిన, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్‌లకు ఇప్పుడు నాయికలు దొరకడం కష్టమయిపోయింది. అందరూ అరవైకి అటూఇటూగా ఉన్నవారే. ఎంత గ్రాఫిక్స్‌లో ముడుతలు తీసేసినా, వారి వయసేంటో తెలుగు ప్రేక్షకులందరికీ తెలుసు. వీరితో నటిస్తే, తమకు ఇక యువహీరోలతో చాన్సులు రావని కుర్ర హీరోయిన్ల భయం. వాస్తవమే కదా… అందుకే పాపం… బాలయ్య.. అటు తిరిగి, ఇటు తిరిగి, మళ్లీ ఏ శ్రియనో, సోనాల్‌ చౌహాన్‌నో ఎంచుకోవాల్సిన పరిస్థితి. ఒక్క సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌కే ఈ విషయంలో వెసులుబాటు ఉంది. రజనీ అనగానే ఏ హీరోయినయినా ఎగిరి గంతేస్తుంది. అయినా, రజనీకాంత్‌ అనుష్క, సిమ్రాన్‌, సోనాక్షి, శ్రియ లాంటి సీనియర్‌ హీరోయిన్ల వైపే మొగ్గు చూపుతున్నారు.

ఇదే ‘ఖైదీ నెం… ’ చిత్రంలో చిరంజీవి – కాజల్‌ల జంటను ప్రేక్షకులు అస్సలు భరించలేకపోయారు. వయసు తేడా కావచ్చు లేదా, కొడుకు రామ్‌చరణ్‌తో మూడు సినిమాలలో అద్భుతమైన కెమిస్ట్రీ పండించడం కావచ్చు, పవన్‌కళ్యాణ్‌తో, అల్లు అర్జున్‌తో నటించడం కావచ్చు.. ఏదేమైనా వారి జంట ఆ చిత్రంలో చాలా ఎబ్బెట్టుగా కనిపించింది. ఇద్దరి మధ్యా ‘సోషల్‌ డిస్టెన్స్‌’ బాగా ఎక్స్‌పోజ్‌ అయింది. సరే… సినిమా హిట్‌ అవడానికి వేరే కారణాలుండొచ్చు గానీ, నాయకానాయికలుగా మాత్రం చిరు-కాజల్‌ ఫెయిలయ్యారని చెప్పక తప్పదు.

ఇప్పుడు మళ్లీ అదే జంట, మరో చిత్రంలో రిపీటవడం అంటే, జీర్ణించుకోవడానికి చాలా కష్టంగా ఉంది. ఏ అనుష్కనో, లేకపోతే మళ్లీ నయనతారనో ఎంచుకుంటే పరిస్థితి కొంచెం భిన్నంగా ఉండేది. ఇలా గుత్తకు తీసుకున్నట్లు అదే హీరో, అదే హీరోయిన్‌ అంటే జనాలకు చిరాకేయడం గ్యారెంటీ. ఈ విషయంలో నిర్మాత-దర్శకులు ఇంకా కొద్దిగా హోంవర్క్‌ చేసుంటే బాగుండేదేమో. ఇప్పుడిక ఏమీ చేయలేం గానీ, సినిమా బాగుండే అవకాశం ఉంది కాబట్టి, మనం చూడకా తప్పదు, వారిని భరించకా తప్పదు.

 

చంద్రకిరణ్‌

Read more RELATED
Recommended to you

Latest news