అడ్డంగా బుక్ అయిన ఖ‌త‌ర్నాక్ లేడీ ఎంపీ

-

ప్రపంచవ్యాప్తంగా మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని చెబుతూ ఉంటారు. ఈ నానుడి చాలా రోజుల నుంచి ఉంది. అయితే బంగ్లాదేశ్ అధికార పార్టీ అవామీలీగ్ మ‌హిళా ఎంపీ తమన్నా న‌స్ర‌త్‌ మాత్రం తన పోలికలు కలిగిన ఎనిమిది మంది వ్యక్తులతో ఆడిస్తున్న నాటకం గుట్టు ఎట్టకేలకు రట్టయ్యింది. కేవలం బంగ్లాదేశ్‌లోనే తనలాంటి పోలికలు ఉన్న ఎనిమిది మంది మహిళలను వెతికి పట్టుకున్న ఆమె ఓపెన్ యూనివర్సిటీ లో తనకు బదులుగా పరీక్షలు రాయిస్తోంది. బంగ్లాదేశ్ అధికార పార్టీ ఎంపీ అయిన తమన్నా బంగ్లాదేశ్ ఓపెన్ యూనివర్సిటీలో రాయాల్సిన 13 పరీక్షల కోసం ఎనిమిది మంది త‌న‌లాంటి పోలిక‌లు ఉన్న డూప్‌ల‌ను ఎంపిక చేసుకున్నారు.

వారికి వివిధ సబ్జెక్టుల్లో శిక్షణ కూడా ఇప్పించారు. తనకు బదులుగా తన పోలికలతో ఉన్న వారిని ఇప్ప‌టి వ‌ర‌కు ప‌రీక్ష‌ల‌కు పంపుతూ వచ్చారు. ఇతరులు ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు తన బాడీ గార్డ్ తో పాటు త‌న మందీ మార్బ‌లాన్ని అన్ని రోజులు ఆ డూప్‌ల‌తో పాటు పరీక్ష కేంద్రాలకు పంపుతూ వచ్చారు. ఇప్పటికే కొన్ని పరీక్షలు ఎవరికీ ఎలాంటి అనుమానాలు లేకుండా వాళ్లు రాసేశారు. ఎంత తమన్నా పోలికలు ఉన్నా తోటి విద్యార్థులు కొందరు మాత్రం ఈ డూపులను సులువుగా గుర్తుపట్టారు. అధికార పార్టీకి చెందిన ఎంపీ కావడంతో ఈ విషయం జోలికి వెళ్ళడం ఎందుకని ఉండిపోయారు.

పైగా ఆమె ధ‌నిక వ‌ర్గానికి చెందిన మ‌హిళ‌. దీంతో ఎవ్వ‌రూ ఆమె గురించ కంప్లెంట్ చేసేందుకు సాహ‌సం చేయ‌లేదు. అయితే చివరికి ఈ విషయం మీడియాకు తెలియడంతో మీడియా సిబ్బంది ఎంపీ పరీక్ష రాస్తున్న ప‌రీక్ష కేంద్రానికి వ‌చ్చి ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. అయితే ముందుగా తమన్నా డూపు తానే తమన్నాని అంటూ సమర్థించుకునే ప్రయత్నం చేసింది. చివరికి మీడియా ప్రశ్నలకు తట్టుకోలేక తాను త‌మ‌న్నా డూప్ అన్న నిజం చెప్పేసింది. అంతే కాకుండా త‌న లాంటి డూప్‌లు మొత్తం ఎనిమిది మంది ఉన్నార‌ని… వాళ్లంతా త‌మ‌న్నాకు బదులుగా ప‌రీక్ష‌లు రాస్తున్నార‌ని చెప్పింది. దీంతో ఆ ఎంపీ ఇంత ఖ‌త‌ర్నాకా అని ఒక్క‌సారిగా అంద‌రూ అవాక్క‌య్యారు.

ఈ విష‌యం దేశ‌వ్యాప్తంగా హ‌ల్‌చ‌ల్ చేయ‌డంతో ఎంపీ తమన్నాను మాత్రం యూనివర్శిటీ నుంచి బహిష్కరించినట్లు యూనివర్శిటీ హెడ్‌ ఎంఏ మన్నన్‌ తెలిపారు. అధికార పార్టీ ఎంపీ కావ‌డంతో ఆమెపై ఎలాంటి చర్య తీసుకోవాలనే విషయంలో ఇంకా మల్లగుల్లాలు పడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news