నిన్న గర్జించిన గొంతు.. నేడు ప్రాధేయపడితే? నిన్న ఉరిమిన కళ్లు.. నేడు జాలిచూపులు చూస్తే? ఎలా ఉంటుంది?.. ఇదిగో అచ్చు .. బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరిలాగానే ఉంటుందని అంటున్నారు పరిశీలకులు. రాజధాని అమరావతి విషయంలో సు జనా వైఖరి.. కొన్ని రోజుల కిందట భారీ ఎత్తున ప్రచారంలోకి వచ్చింది. “అంగుళం కూడా అమరావతిని కదిలించడానికి వీల్లేదు. అ మరావతికి భారీ ఎత్తున కేంద్రం నిధులు ఇచ్చింది. కాబట్టి.. కేంద్రానికి చెప్పకుండా ఏమీ జరగడానికి వీల్లేదు. ఇక్కడ ఏం జరిగినా.. కేంద్రం చూస్తూ ఊరుకోదు. ఒక్కొక్కరి పని పడుతుంది. కేంద్రం ఎప్పుడు జోక్యం చేసుకోవాలో అప్పుడు జోక్యం చేసుకుంటుంది. అంత తేలికగా వదిలేయదు“ అని ఆదిలో అమరావతి రైతులకు ధైర్య వచనాలు పలికారు సుజనా.
దీంతో పాపం అమరావతి రైతులు నిజమే అనుకున్నారు. ఇంకేముంది కేంద్రం జోక్యంతో తమ తలరాతలు మారిపోకుండా ఉంటా యని, జగన్ ప్రభుత్వానికి మొట్టికాయలు ఖాయమని అనుకున్నారు. అయితే, ఇంతలోనే కేంద్రం నుంచి వచ్చిన దూతగా జీవీ ఎల్ అనూహ్య ప్రకటన చేశారు. కేంద్రానికి, రాష్ట్ర రాజధానికి ఎలాంటి సంబంధం లేదన్నారు. ఈవిషయాన్ని తాను కేంద్రంతోనే సంప్రదించి చెబుతున్నానని కుండబద్దలు కొట్టారు. దీంతో సుజనాకు గాలిపోయింది.
ఇక, ఆ తర్వాత ఆయన ప్లేట్ ఫిరాయిం చారు. ఇంత మంది రైతులకు అన్యాయం జరుగుతుంటే ఎవరు మాత్రం చూస్తూ ఊరుకుంటారు.. అంటూనే ఆయన వెళ్లి హైదరాబాద్‌లో కూర్చున్నారు. ఇక, ప్రభుత్వం మరింత దూకుడుతో ముందుకు వెళ్లడంతో ఏం చేయాలో అర్ధం కాని పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు.
ఈ నేపథ్యంలోనే తాజాగా సుజనా చౌదరి.. జగన్ సర్కారుకు ఏకంగా పది పేజీల లేఖ రాశారు. “ఆలోచించండి-అన్యాయం చేయొద్దు-అమరావతి ఉంటే ఇంత లాభం వస్తుంది-అమరావతి లేకపోతే.. ఇంత నష్టం వస్తుంది-రైతులు ఇన్ని ఎకరాల భూములు ఇచ్చారు- ప్రభుత్వం వద్ద ఇంత ల్యాండ్ ఉంది-దీనిని వినియోగించుకుంటే ఇంత లాభం వస్తుంది-ప్లీజ్.. ప్లీజ్.. ప్లీజ్“- అంటూ ఆ పది పేజీల్లో పది చోట్ల కూడా ప్లీజ్ అంటూ రాసుకొచ్చారు.
ఈ వ్యవహారం చూసిన వారు ముక్కున వేలుసుకున్నారు. ఈయనేనా మొన్నామధ్య అంగుళం కూడా కదిలించేందుకు కేంద్రం ఒప్పుకోదని చెప్పింది..! అంటూ చర్చించుకోవడం ప్రారంభించారు. ఇక, మరో నాలుగు రోజులు పోతే.. ఇప్పటికే కాళ్ల బేరానికి వచ్చిన ఈ నాయకులు ఇంకెలాంటి జిమ్మిక్కులు చేస్తారోనని అంటున్నారు. విషయాన్ని ఉన్నది ఉన్నట్టుగా ముందు నుంచిచెప్పకపోవడం, చేయాలనుకున్నది చేయకపోవడం కొందరికి రాజకీయంగా కలిసి రావడంలేదనే వాదన బలంగా వినిపిస్తోంది.