టీఎస్‌ఆర్టీసీ పయనమెటు?

-

ఏ దిక్కుకో ఈ పయనం? అన్నట్టు, తీవ్ర ఆందోళనల నడుమ టీఎస్‌ఆర్టీసీ భవిష్యత్తు భయం కలిగిస్తోంది. విలీసం అంశాన్ని పక్కనబెట్టామన్నా కూడా ప్రభుత్వం ససేమిరా అంటోంది. అంటే, ఒకవేళ బేషరతుగా సమ్మె విరమించినా, ఎవరినీ తీసుకునే ఉద్దేశ్యం లేనట్లే కనబడుతోంది.

ఆర్టీసీ కార్మికుల బతుకులు దయనీయంగా మారాయి. రోజుకో ఆత్మహత్య, ప్రయత్నాలతో సమ్మె బింకం సడలుతోంది. పూట గడవడానికి కూడా కరువై, కూలీకి వెళ్తున్న వార్తలు, పిల్లవాడి చికిత్సకు పైసలు లేక కళ్లముందే కడతేరిపోతే ఎవరు బాధపడుతున్నారు? ఎవరు సంతోషపడుతున్నారు?

టీఎస్‌ఆర్టీసీ సమ్మె ప్రారంభించి, నేటికి 44రోజులు. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా నడుస్తున్నప్పుడు కూడా ఆర్టీసీ సమ్మె ఇన్ని రోజులు లేదు. 49వేల మంది కార్మికులు ప్రస్తుతం రోడ్డు మీద ఉన్నారు. వారి కుటుంబాటు బిక్కుబిక్కుమంటున్నాయి. తెలంగాణ ప్రభుత్వం తన మంకుపట్టు వీడటం లేదు. కార్మికుల నిరసనలపై, దీక్షలపై భయంకరంగా ఉక్కుపాదం మోపింది. అసలు ప్రభుత్తం ఎవరిని లక్ష్యంగా చేసుకుని సమ్మెను వాడుకుంటోంది.?

నిన్నమొన్నటి ప్రభుత్వ అఫిడవిట్లు పూర్తిగా తమ దిశను మార్చుకున్నట్టు కనిపిస్తోంది. ఆర్టీసీ కార్మికులు బేషరతుగా సమ్మె విరమించినా, ఇప్పుడు వారిని సర్వీస్‌లోకి తీసుకునేట్టుగా కనబడటం లేదు. ఇప్పుడు విలీసం, జీతాలు, ఇంక్రిమెంట్లు అనే ప్రస్తావనే లేకుండా అసలు పూర్తిగా ఆర్టీసీనే లేకుండా చేయాలనేది ప్రభుత్వ ఉద్దేశంగా ఈ అఫిడవిట్లలో కనబదుతోంది. ఒకే దెబ్బకు రెండు పిట్టలన్నట్లు, విపక్షాలను ఎదుర్కొనేందుకు ఆర్టీసీని వాడుకోవచ్చన్న ఆలోచనతోనే కేసీఆర్‌ అడుగులు వేస్తున్నారు.

ఎలా? కేసీఆర్‌ ఇలా ఎలా మారారు? ఉద్యమ సమయంలో వాడవాడనా, పల్లెపల్లెనా, తిరుగాడి, ఎక్కడపడితే అక్కడ రెండు మెతుకులు గతికి, కనపడ్డవాళ్లనల్లా హత్తుకుని ప్రపంచస్థాయి ఉద్యమాన్ని నిర్మించిన కేసీఆర్‌ ఇలా ఎలా? ఆయనది చాలా పెద్ద చెయ్యని చెబుతారు. ఇప్పటికీ మధ్యాహ్నం ఇంటికి వెళ్లినవారిని చేయి కడుగకుండా వెళ్లనీయరని చాలా మంది అంటారు. మరి ఇక్కడ లక్షమంది నకనకలాడుతుంటే ఆయన ఎలా భరిస్తున్నారు? 24మంది ఆత్మార్పణం గావిస్తే, నాడు కన్ణీళ్లు పెట్టుకున్న కేసీఆర్‌ ఈనాడేమయ్యారు? అడిగినవాడికి, అడగని వాడికీ, ఆశించిన దానికంటే ఎక్కువగా అన్నీ ఇచ్చిన కేసీఆర్‌ ఆర్టీసీకి మాత్రం మొహం చాటేస్తున్నారెందుకు?

అసలు సమస్య ఎవరితో? ఆశ్శత్థామరెడ్డితోనా, రాజిరెడ్డితోనా, థామస్‌రెడ్డితోనా? లేక కాంగ్రెస్‌, బీజేపీ, ఎమ్మార్పీఎస్‌ తోనా? కాకపోతే ఇది సంస్థకు, ప్రభుత్వానికి మధ్య ఉన్న సమస్యలా లేదు. కేసీఆర్‌కి, యూనియన్‌ నాయకులకు మధ్య ఉన్నట్లు అందరికీ అగుపిస్తోంది. ఒకవేళ యూనియన్‌ నాయకులతోనే అయితే, వాళ్లను పక్కనబెట్టడం ఆయనకు ఎంతసేపు? వారి కోసం 49వేల కుటుంబాలను బాధించడం ఎంతవరకు సబబు?

ఇక విపక్ష పార్టీలంటే పెద్ద విషయమేమీకాదు. ఆయన వారిని లెక్కచేసినట్లు ఎక్కడా దాఖాలాలు లేనేలేవు. నిజానికి ముఖ్యమంత్రి గారు తలచుకుంటే ఈ సమస్య నిమిషాల్లో పరిష్కారమవుతుంది. ఆ విషయం తెలంగాణ రాష్ట్ర జనాభా అంతటికీ తెలుసు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు అందరూ ఈ విషయంపై ఎంతో సానుభూతితో ఉన్నా, పెద్దాయన మనసు మాత్రం కరగడం లేదు. టిఆరెస్‌ నాయకులందరూ ఈ పరిస్థితి పట్ల బాధపడుతున్నట్లు అంతర్గత సంభాషణల్లో మధనపడుతున్నట్లు తెలుస్తోంది. కానీ, ఎవరూ ధైర్యం చేసి ఆయనకు చెప్పలేరు. ఏదేమైనా, ఇది పూర్తిగా ముఖ్యమంత్రి మాత్రమే పరిష్కరించదగ్గ అంశంగా మారిపోయింది. హైకోర్టులు, సుప్రీంకోర్టులు కూడా ఏమీ చేయలేవు. విలీనం అంశాన్ని పూర్తిగా వదిలేసామని చెబితేనే ఏదైనా ప్రయోజనముండే అవకాశముంది. లేదూ… ఇక్కడిదాకా వచ్చాక ఇక వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదని యూనియన్లు అనుకుంటే, ఇది ఇప్పట్లో తేలేదికాదు.

– రుద్రప్రతాప్‌

Read more RELATED
Recommended to you

Latest news