విశాఖ వైసీపీలో తనదైన శైలిలో దూసుకుపోతున్నారు కేకే రాజు. వైసీపీ సమన్వయ కర్తగా ఉన్న రాజు.. సీఎం జగన్ విశాఖను రాజధానిగా ప్రకటించిన తర్వాత తనదైన శైలిలో అక్కడ ప్రచారం చేస్తున్నారు. మూడు రాజధానుల ప్రాధాన్యాన్ని కూడా వివరిస్తున్నారు. అంతేకాదు, జగన్‌కు మద్దతుగా నగరంలో భారీ ర్యాలీలు కూడా నిర్వహిస్తున్నారు. అంతేకాదు.. విశాఖలో పార్టీని బలోపేతం చేసేందుకు కూడా కృషి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఉత్తర నియోజకవర్గంలో మరింతగా పార్టీకి మద్దతు కూడగడుతున్నారు. ఇటీవల ఆయన సమన్వయకర్తగా ఉన్న ఉత్తర నియోజకవర్గంలో జనసేన, టీడీపీ నాయకులు దాదాపు భారీ ఎత్తున వైఎస్సార్‌సీపీలో చేరారు.
దీంతో విశాఖ ఉత్తర నియోజకవర్గ పరిధిలో వైఎస్సార్‌సీపీలో నూతనోత్సాహం నెలకొంది. వాస్తవానికి ఉత్తరం నియోజకవర్గంలో టీడీపీకి తిరుగులేని బలం ఉంది. ఇక, గత ఏడాది జరిగిన ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ అభ్యర్థి, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో రాజు గంటాకు గట్టి పోటీ ఇచ్చారు. కేవలం 1900 ఓట్ల తేడాతో మాత్రమే ఇక్కడ గంటా చావుతప్పి కన్నులొట్టబోయిన చందంగా గెలిచారు. గంటా ఎన్నికల్లో గెలిచినా తర్వాత నిస్తేజంగా ఉన్నారు. అయితే, ఇటీవల బీజేపీ నుంచి ఓ వంద మంది చోటా కార్యకర్తలను పార్టీలో చేర్చుకున్నారు. దీంతో నియోజకవర్గంలో ఆయన పుంజుకున్నారనే వార్తలు వచ్చాయి.
కానీ, అనూహ్యంగా ఇప్పుడు రాజు గంటా దూకుడుకు చెక్ పెట్టే రేంజ్‌లో వ్యవహరించి. రెండు కీలక పార్టీల నుంచి నాయకులను తనవైపు తిప్పుకొని పార్టీలో చేర్చుకున్నారు. త్వరలోనే స్థానిక సంస్థలకుఎన్నికలు రానుండడం, మరోపక్క విశాఖను రాజధానిగా చేస్తుండడంతో పార్టీని బలపేతం చేసేందుకు రాజు చూపిస్తున్న దూకుడుతో యువత కూడా ఆయన మాటలకు పిదా అవుతున్నారు. ఈ క్రమంలోనే ఇతర పార్టీల నుంచి నాయకులు క్యూకడుతున్నారని అంటున్నారు.
ఇక, ఇక్కడ నుంచి 2014 ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ నాయకుడు విష్ణుకుమార్ రాజు.. అన్నివిధాలా చెడుతున్నారనే వాదన వినిపిస్తోంది. ఆయన అటు బీజేపీలోనూ ఇమడ లేక పోతున్నారు. ఇటు పార్టీ మారే విషయంలోనూ చర్యలు తీసుకోలేక పోతున్నారు. దీంతో ఆయన పరిస్థితి అగమ్యంగా ఉండడంతో కార్యకర్తలు, దిగువ శ్రేణి నాయకులు కూడా పార్టీ నుంచి బయటకు వస్తున్నారనే వాదన వినిపిస్తోంది. మరి ఈ పరిస్థితిలో వైసీపీ దూకుడు ముందు ఇతర పార్టీలు వెనక్కి తగ్గక తప్పదని అంటున్నారు పరిశీలకులు.