ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో ఎట్టకేలకు రామ మందిర నిర్మాణ పనులు ప్రారంభం కానున్న విషయం విదితమే. కాగా ఆలయాన్ని మొత్తం 3 అంతస్థుల్లో నిర్మించనున్నారు. అందులో గ్రౌండ్ ఫ్లోర్, మొదటి, రెండో అంతస్థులు ఉంటాయి. మొత్తం 10 ఎకరాల విస్తీర్ణంలో ఆలయ నిర్మాణం జరుగుతుంది. మిగిలిన 57 ఎకరాల్లో ఆలయ కాంప్లెక్స్ నిర్మాణం జరుగుతుంది.
కాగా రామ మందిర నిర్మాణ ప్లాన్‌కు ఇప్పటికే శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ఓకే చెప్పింది. ఈ నేపథ్యంలో ట్రస్టు సభ్యులు ప్రస్తుతం రామ మందిర నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్నారు. ఇక ఆలయ కాంప్లెక్స్‌లో ఓ నక్షత్ర వాటికను కూడా నిర్మించనున్నారు. ఇందులో మొత్తం 27 నక్షత్ర వృక్షాలను నాటుతారు. దీని వల్ల భక్తులు తమ జన్మదినాల్లో వృక్షాల కింద కూర్చుని ధ్యానం, పూజలు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది.
రామ మందిరానికి 15 అడుగుల లోతున పునాదులు తీయనున్నారు. మొత్తం 8 పొరల్లో పునాది ఉంటుంది. ఒక్కో పొర వెడల్పు సుమారుగా 2 అడుగులు ఉంటుంది. పూర్తిగా కాంక్రీట్‌ను ఉపయోగించి పునాదులు నిర్మిస్తారు. ఆలయ నిర్మాణంలో ఇనుమును వాడడం లేదు. ఇక వాల్మీకి రామాయణంలో తెలిపిన అనేక వృక్షాలను ఆలయ కాంప్లెక్స్‌లో నాటుతారు. ఆ చెట్లు ఉండే ప్రాంతానికి వాల్మీకి రామాయణ అని పేరు పెట్టనున్నారు.
భూమి పూజ అనంతరం ఆలయ స్థలంలో శేషావతార ఆలయాన్ని తాత్కాలికంగా నిర్మిస్తారు. రామ మందిరం పూర్తిగా నిర్మాణం కాగానే శేషావతార ఆలయాన్ని కూడా శాశ్వతంగా నిర్మిస్తారు. ఆలయ ప్రాంగణంలో రామకథ కుంజ్ పార్క్‌ను నిర్మించనున్నారు. శ్రీరాముడి జీవితంలోని పలు ముఖ్యమైన ఘట్టాల థీమ్‌తో ఆ పార్కును నిర్మిస్తారు. అలాగే ఆలయ ప్రాంగణంలో మ్యూజియంను ఏర్పాటు చేయనున్నారు. గతంలో ఆలయ స్థలం తవ్వకాల్లో బయటపడిన పలు వస్తువులను ఆ మ్యూజియంలో ఉంచుతారు. అలాగే గోశాల, ధర్మశాల, ఇతర చిన్న చిన్న ఆలయాలను కూడా ఆలయ ప్రాంగణంలో నిర్మించనున్నారు.
అయోధ్య రామ మందిరం ఎత్తు 161 అడుగులుగా ఉండనుంది. ఆగస్టు 5వ తేదీన ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేసిన రోజున దేశవ్యాప్తంగా ఉన్న హిందువులు సాయంత్రం తమ వాకిళ్ల ఎదుట దీపాలను వెలిగించాలని ఇప్పటికే విశ్వ హిందూ పరిషత్ పిలుపునిచ్చింది. కాగా భూమి పూజకు ప్రధాని మోదీ హాజరు కానున్నారు. మరో 250 మంది ముఖ్యమైన నేతలు కార్యక్రమంలో పాల్గొంటారని తెలిసింది.