Left Handers Day : లెఫ్ట్ హ్యాండర్ల కోసం ప్రత్యేక వస్తువులు

-


ఫోన్ బటన్స్ కుడివైపు ఎక్కువ ఉంటాయి. కీబోర్డ్ అంతా కుడి చేతి వాటం వారి కోసమే అన్నట్టు ఉంటుంది. ఆల్ఫాబెట్స్ ఒకవైపు, నంబర్లు ఒకవైపు ఉంటాయి. ఇది కుడిచేతి వాటం వారికి ఈజీనే. కానీ ఎడమ చేతివాటం వారి పరిస్థితి ఏంటి? కత్తెర, తాళంచెవి, దువ్వెనా, పెన్నులు, స్కేళ్లు ఒకటేంటి ఇంకా మనం రోజూ వాడే వస్తువులు ఎన్నో ఉంటాయి. వాటిని వాడడం కుడిచేతివారికి సులభమే కానీ ఎడమచేతివారికే కష్టం.. మరి వీటికి పరిష్కారం ఏమీ లేదా? ప్రత్యేక వస్తువులు ఏమీ ఉండవా?  ఉన్నాయి. అవేంటో చూడండి.. ఈరోజు లెఫ్ట్ హ్యాండర్స్ డే సందర్భంగా లెప్టీస్ ప్రొడక్ట్‌లేంటో తెలుసుకోండి..

కీబోర్డు, మౌస్, ఫోన్, టూత్‌బ్రష్, తాళంచెవి వంటి వస్తువులు మనం రోజూ వాడేవి. ఇవే కాకుండా ఇంకా ఎన్నో వస్తువులు మన డైలీ లైఫ్‌లో భాగం అయిపోయి ఉంటాయి. అవన్నీ కుడి చేతి వాటం ఉన్నవారి కోసమే తయారైనవి. ఎడమ చేతి వాటం వారు కూడా వీటితోనే సర్దుకుపోతారు. కానీ అలాంటి వారి కోసం ప్రత్యేక ఉత్పత్తులున్నాయి.
కొన్ని కంపెనీలు లెఫ్ట్ హ్యాండర్ల కోసం కొన్ని ప్రత్యేక ఉత్పత్తులను తయారు చేయడం ప్రారంభించాయి. అందులో ఒకటి అమెరికన్ సంస్థ లెఫ్టీస్. ఎడమ చేతి వాటం వాళ్లకి అనుకూలమైన వస్తువుల్ని తయారు చేస్తున్నది. ఇంటర్నెట్ వేదికగా వీటిని కొనుగోలు చేయవచ్చు. leftyslefthanded.com అనే సైట్ నుంచి కావాల్సిన వస్తువులను ఆర్డర్ చేయవచ్చు. కత్తెరలూ, కప్పులూ, పెన్నులూ, పెన్సిళ్లూ, నోటు పుస్తకాలూ, ఇంకా చాలా వస్తువుల్ని ఎడమ చేతివాటం వాళ్లకు అనుకూలంగా డిజైన్ చేసి ఉంచారు. ఉదాహరణకు కత్తెర తీసుకుందాం. ఎడమచేతి వాటం వాళ్లకి సరిపోయేలా హ్యాండిల్‌ను, దాంట్లోని కత్తుల అమరికను మార్చారు. దానివల్ల వారికి అనుకూలంగా ఉంటుంది. మామూలు కత్తెరతో కట్ చేస్తే వారికి కనిపించకుండా ఇబ్బందిగా ఉంటుంది. సాధారణంగా పుస్తకంలోని పేజీలను ఎడమవైపు తిరగేస్తూ కుడివైపు రాసుకుంటాం.
ఎడమచేతి వాళ్లకి తయారుచేసిన వాటిలో కుడిచేతివైపు పేజీల్ని తిరగేస్తూ ఎడమవైపు రాసుకోవచ్చు.
వీరి చేతిరాత మెరుగవ్వడానికి పుస్తకాలూ ఉన్నాయి. anythinglefthanded.co.uk వెబ్‌సైట్ కూడా వీటికోసం ప్రత్యేకంగా ఉంది. దీంట్లో కిచెన్ సామగ్రి, కప్పులూ, గరిటెలూ, స్పూన్లు లాంటివీ ఉంటాయి. ఇంకా ఇవే కాకుండా రోజూ బయట వాడే వస్తువులదీ ఇదే పరిస్థితి. పర్సులు, ఫోన్లు, కీస్, వాచీలు ఇవ్వన్నీ లెఫ్ట్ హ్యాండర్స్‌కు ఇబ్బందే. పర్సుల్లో కుడివైపు మాత్రమే కార్డులూ, కాగితాలూ పెట్టుకోవడానికి వీలుంటుంది. అందుకే లెఫ్టీ పర్సులు తయారు చేశారు. ఈ పర్సుల్లో ఎడమవైపు పెట్టుకోవడానికి ఉంటుంది. ముఖ్యంగా లెఫ్ట్ హ్యాండర్స్ కోసం ప్రత్యేక గిట్లారు కూడా ఉన్నాయి. సౌత్‌పా గిటార్స్ పేరుతో ఓ సంస్థ వీరికోసం గిటార్లని అందిస్తున్నది. ఈ జాబితాలో కంప్యూటర్ కీబోర్డులూ, స్కేలూ, టేపూ, పేక ముక్కలూ, కుర్చీలూ ఉన్నాయి. ఏరోడైనమిక్స్ బూమ్‌రాంగ్‌ను ప్రత్యేకమైన డిగ్రీల కోణంలో విసరాల్సి ఉంటుంది. ఆ కోణం కుడి, ఎడమ చేతుల వారికి పరస్పరం వ్యతిరేకంగా ఉంటుంది. అందుకే ఎడమ చేతి వాటం వారికోసం డిజైన్ మార్చి బూమ్ రాంగ్ తెచ్చారు. సాధారణంగా వాచీలను ఎడమ చేతికి కట్టుకొని కుడిచేత్తో వాటి కీ తిప్పుకోవడానికి వీలుంటుంది. ఈ వాచీల్ని కుడిచేతికి కట్టి ఎడమ చేత్తో తిప్పుకోవడానికి వీలుగా కీని ఎడమవైపు ఉంచుతారు. వీరి కోసం అపసవ్యదిశలో తిరిగే టేబుల్, గోడ గడియారాలూ వచ్చాయి. జర్మనీకి చెందిన ల్యామీ సంస్థ వీరికి ప్రత్యేకమైన పెన్నులను కూడా మార్కెట్లోకి తెచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news