అమెరికా వద్దని హెచ్చరిస్తున్నా రఫా నగరంపై ఇజ్రాయెల్ దాడులకు తెగబడింది. వెస్ట్ బ్యాంక్లో ఉన్న శరణార్థి శిబిరంపై చేసిన దాడిలో 14 మంది పాలస్తీనీయులు చనిపోయినట్లు పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ దాడిలో గాయపడిన వారిని తీసుకెళ్లడానికి వచ్చిన అంబులెన్స్ డ్రైవర్ కూడా మరణించినట్లు తెలిపింది. ఇజ్రాయెల్ దళాలు దాదాపు 24 గంటలకు పైగా దాడి చేసినట్లు పేర్కొంది.
‘పాలస్తీనా నగరమైన తుల్కర్మ్కు సమీపంలో ఉన్న నూర్ షామ్స్ ప్రాంతంలో ఇజ్రాయెల్ దళాలు శుక్రవారం తెల్లవారుజాము నుంచే దాడిని ప్రారంభించాయి. దాదాపు 24 గంటలు అంటే శనివారం వరకు కాల్పులు జరుపుతూనే ఉన్నాయి. ఈ దాడిలో మరణించిన వారిలో ఓ బాలుడు, ఒక యువకుడు ఉన్నారు. గాయపడిన వారిని తీసుకెళ్లేందుకు వచ్చిన అంబులెన్స్ డ్రైవర్ మహ్మద్ అవద్ అల్లా మూసా(50)ను ఇజ్రాయెల్ సైన్యం చంపింది. ఇలా అంబులెన్స్లు, వైద్య సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడం అంతర్జాతీయ మానవతా చట్టం ఉల్లంఘన కిందకు వస్తుంది’ అని పాలస్తీనా ఆరోగ్య శాఖ పేర్కొంది.