హైదరాబాద్‌లో పలు చోట్ల తాగునీటి సమస్య తలెత్తిన నేపథ్యంలో జలమండలి చర్యలకు ఉపక్రమించింది. మహానగరానికి నీటిని అందించే నాగార్జునసాగర్ జలాశయంలో అత్యవసర పంపింగ్‌ను ప్రారంభించింది. 10 పంపులను ప్రారంభించిన నగరానికి నీరు సరఫరా చేస్తోంది.నీటిలో తేలియాడే సబ్‌మెర్సబుల్ పంపుల ద్వారా నీటిని సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేశారు. సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుతం 508 అడుగులకు చేరింది. నీటి మట్టం డెడ్ స్టోరేజీకి చేరుకోవడంతో ఆ ప్రభావం హైదరాబాద్ తాగునీటిపై పడకుండా ఉండేందుకు ఏడేళ్ల తర్వాత అత్యవసర పంపింగ్ ప్రారంభించారు.
ఓఆర్ఆర్ వరకు విస్తరించిన నగర వాసుల తాగునీటి అవసరాల కోసం జలమండలి నాగార్జునసాగర్, అక్కంపల్లి, కృష్ణా ఫేజ్ – 1, 2, 3 ల ద్వారా రోజుకి 270 ఎంజీడీల నీటిని తరలిస్తోంది. నెలకు 1.38 టీఎంసీల నీటిని సరఫరా చేస్తున్నారు. ఈ ఏడాది నగరానికి సరఫరా చేసే సామర్థ్యం 2600 ఎంఎల్‌డీలకు పెంచారు. ఈ నీటిని నగరంలో ప్రధానంగా బోరుబావులు ఎండిపోయిన ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. మే 15 నుంచి మరో 30 ఎంఎల్‌డీల నీటిని సరఫరా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు జలమండలి ఉన్నతాధికారులు తెలిపారు.