ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ గురించి నిత్యం ఏదోఒక షాకింగ్ న్యూస్ బయటకు వస్తోంది. శాస్త్రవేత్తలు చేస్తున్న పరిశోధనల్లో ఈ విషయాలు వెల్లడవుతున్నాయి. తాజాగా.. మరో విషయం బయటకు వచ్చింది. కరోనా వైరస్ బారిన పడకుండా ప్రజల్ని కాపాడడానికి భౌతిక దూరం పాటించాలని.. ఆరు అడుగుల భౌతిక దూరం సరిపోతుందని ఇన్నిరోజులూ అనుకున్నాం. కానీ… కానీ ఆ దూరం సరిపోదని ఆక్స్ఫర్డ్, మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడైంది. కొవిడ్–19 బాధితుడు దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు ఆ వ్యక్తి నోటి నుంచి వెలువడే తుంపర్లు కొద్ది సెకండ్లలోనే 26 అడుగుల వరకు ప్రయాణిస్తాయని ఆ సర్వే వెల్లడించింది.
అయితే.. వైరస్ బారిన పడిన వ్యక్తి మాట్లాడినప్పుడు నోటి నుంచి వచ్చే తుంపర్లు ఆరు అడుగుల దూరం వరకు ప్రయాణిస్తాయని, అదే దగ్గడం, తుమ్మడం లేదంటే పాటలు పాడడం వంటివి చేసినప్పుడు మాత్రం ఏకంగా 26 అడుగుల దూరం ప్రయాణిస్తాయని ఆ పరిశోధనలో తేలింది. ఈ నేపథ్యంలో కొవిడ్‌కు అడ్డుకట్ట వేయడానికి భౌతిక దూరం నిబంధనలు మార్చాలని శాస్త్రవేత్తలు ప్రభుత్వాలకు సూచిస్తున్నారు.