ఓవైపు ప్రపంచ దేశాల్లో ముఖ్యంగా భారత్ లో సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తూ జనాన్ని అల్లాడిస్తుంటే మరోవైపు బ్రెజిల్ మాత్రం వర్షాలు దంచికొడుతున్నాయి. భారీ వర్షాల ధాటికి బ్రెజిల్‌ను వరదలు ముంచెత్తుతున్నాయి. ఆ దేశంలో వరదలు విలయం సృష్టిస్తున్నాయి. దేశ దక్షిణ ప్రాంతంలోని రియో గ్రాండ్ డి సుల్ రాష్ట్రం వరదలతో అతలాకుతలమైంది. దాదాపు 60 మంది మృతి చెందారు. మరో 70 మంది వరకు గల్లంతయ్యారు.
దాదాపు 70 వేల మంది నిరాశ్రయులు అయ్యారు. వారందరినీ పునరావాస కేంద్రాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు. గత 80 ఏళ్లలో ఈ స్థాయిలో వరదలు ముంచెత్తడం ఇదే తొలిసారని అక్కడి వాతావరణ నిపుణులు వెల్లడించారు. ఈ ఏడాది బ్రెజిల్‌ను కుదిపేసిన నాలుగో విపత్తు ఇది అని పేర్కొన్నారు. జులై, సెప్టెంబరు, నవంబరులోనూ వరదల వల్ల 75 మంది మరణించారు. తాజాగా కొన్ని ప్రాంతాల్లో నమోదైన వర్షపాతం 150 ఏళ్ల క్రితం నాటి రికార్డు స్థాయిని దాటిందని బ్రెజిల్ జియోలాజికల్ సర్వీస్ వెల్లడించింది.