ఆఫ్ఘనిస్థాన్ లో బుధవారం నాడు సంభవించిన భూకంపానికి సుమారు వెయ్యిమందికి పైగా మరణించినట్లు ఆ దేశ అధికార యంత్రాంగం ప్రకటించింది. ఈ భూకంపంలో 1500 మందికి పైగా గాయపడ్డట్టు వారు పేర్కొన్నారు.భూకంప తీవ్రత ఇంకా కొనసాగవచ్చని, ప్రజలంతా సురక్షిత ప్రదేశంలో తల దాచుకోవాలని తాలిబన్ ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. పాకిస్తాన్ సరిహద్దుకు సమీపంలోని ఆగ్నేయ ఆఫ్ఘనిస్తాన్ లోని కొన్ని ప్రాంతాల్లో బుధవారం తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది.
కోస్ట్ నగరానికి 44 కిలోమీటర్ల దూరంలో 51 కిలోమీటర్ల లోతులో భూకంపం వచ్చిందని యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. ఈ భూకంపం ప్రభావం రిక్టర్ స్కేల్ పై 6.1 తీవ్రతతో నమోదైందని పేర్కొంది. గత శుక్రవారం ఇస్లామాబాద్, పెషావర్, రావల్పిండి, ముల్తాన్ తో సహా పలు పాకిస్తాన్ నగరాలు రిక్టర్ స్కేల్ పై 5.0 తీవ్రతతో భూకంపం కుదిపేసింది. భూకంపంతో రెండు దేశాల ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.