ఇటీవల అమెరికా గగనతలంపై కలకలం రేపిన చైనా నిఘా బెలూన్‌ను అగ్రరాజ్యం కూల్చివేసిన విషయం తెలిసిందే. ఈ ఆపరేషన్‌కు సంబంధించిన సున్నితమైన వివరాలను అమెరికా అధికారులు భారత్ సహా మరికొన్ని మిత్రదేశాలతో పంచుకున్నారు. భారత్-అమెరికా వాయు సేనలు సంయుక్తంగా నిన్న ‘ఎక్స్‌కోప్‌ఇండియా 23’ పేరిట వాయుసేన విన్యాసాలు ప్రారంభించాయి. భారత వాయుసేన చీఫ్ వీఆర్ చౌద్రీ, అమెరికాకు చెందిన పసిఫిక్ ఎయిర్‌ఫోర్స్ కమాండర్ కెన్నిత్ విల్స్‌బాష్ న్యూదిల్లీలో భేటీ అయ్యారు. పరస్పర ప్రయోజనాలున్న అంశాలపై సహకారానికి సంబంధించి చర్చించారు.
చైనా బెలూన్ కూల్చివేత ఆపరేషన్ వివరాలను భారత్ సహా కొన్ని వాయుసేనలతో కెన్నిత్ పంచుకున్నట్లు పేర్కొన్నారు. ‘’అమెరికాలో చోటు చేసుకొన్న పరిణామాలపై ఈ ప్రాంతంలోని ఎయిర్ చీఫ్స్‌తో సంక్షిప్తంగా చర్చించాం. చైనా బెలూన్‌ను కూల్చివేసే సమయంలో ఎటువంటి అంశాలను పరిగణనలోకి తీసుకొన్నాం.. అది ఎటువంటి సవాళ్లను మాకు విసిరింది.. ఒక వేళ దానిలో మనుషులు ఉంటే ఏం చేయాలనుకొన్నాం.. వంటి అంశాలపై సమాచారం ఇచ్చాం’’ అని వెల్లడించారు.