ప్రపంచంలోనే తొలిసారిగా నైట్రోజన్ గ్యాస్ వినియోగించి ఓ ఖైదీకి మరణశిక్ష విధించారు. ఈ విషయంపై ఇటీవలే ప్రకటన చేసిన అమెరికాలోని అలబామా జైలు అధికారులు ఈ వ్యవహారంపై ఎన్ని విమర్శలు వచ్చినా చివరకు చెప్పినట్లే శిక్ష అమలు చేశారు. 1988లో ఓ మతాధికారి భార్య ఎలిజబెత్ సెనెట్‌ను హత్య చేసిన కేసులో కెన్నెత్ స్మిత్ (58)కు దీనిని అమలు చేసినట్లు అలబామా పోలీసులు తెలిపారు. ‘డెత్ పెనాల్టీ ఇన్ఫర్మేషన్ సెంటర్’ ప్రకారం ప్రపంచంలో స్వచ్ఛమైన నైట్రోజన్ గ్యాస్‌ను వాడి మరణశిక్ష విధించడం ఇదే తొలిసారి. ఈ శిక్ష అమలును ప్రత్యక్షంగా వీక్షించడానికి ఐదుగురు మీడియా సభ్యులను అట్మోర్‌లోని హోల్మన్ కరెక్షన్ ఫెసిలిటీకి అనుమతించారు.
మరోవైపు మరణశిక్షకు ముందు స్మిత్ మాట్లాడాడు. అలబామా ఇవాళ మానవత్వాన్ని ఒక అడుగు వెనక్కి తీసుకెళుతోందని అన్నాడు. తనకు మద్దతుగా నిలిచినందుకు ధన్యవాదాలు చెప్పాడు. ఆ తర్వాత అతడికి అధికారులు మాస్కును బిగించి దాని నుంచి నైట్రోజన్ గ్యాస్‌ను పంపించగా ఏడు నిమిషాల్లో అతడు మరణించినట్లు అధికారులు తెలిపారు. మరణ శిక్ష అమలు పూర్తైందని.. అతడి మరణాన్ని అలబామా గవర్నర్ ధ్రువీకరించారు.