అమెరికాలో గతవారం పలు ప్రాంతాల్లో టెలికాం సేవల్లో అంతరాయం ఏర్పడింది. అయితే దీనికి ప్రభావితమైన తమ కస్టమర్లకు ఏటీ అండ్ టీ కంపెనీ పరిహారం ప్రకటించింది. ఒక్కొక్క కస్టమర్ కు ఐదు డాలర్లు పరిహారంగా చెల్లిస్తామని తెలిపింది. వచ్చే రెండు బిల్లింగ్ సైకిళ్లలో ఈ మొత్తాన్ని ఖాతాల్లో జమ చేస్తామని వెల్లడించింది. ప్రీపెయిడ్ యూజర్లు కూడా ఇబ్బందులు ఎదుర్కొని ఉంటే వారికి పరిహారం విషయంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొంది.
ఏటీ అండ్ టీ, వెరిజోన్, టి-మొబైల్‌తో పాటు ఇతర మొబైల్ నెట్‌వర్క్‌లలో కనెక్టివిటీ సమస్య తలెత్తినట్లు డౌన్‌డిటెక్టర్ అనే నెట్‌వర్క్ ట్రాకింగ్ సైట్ గతవారం వెల్లడించింది. షికాగో, లాస్ ఏంజిల్స్, న్యూయార్క్ సిటీ, శాన్‌ఫ్రాన్సిస్కో, హూస్టన్, బ్రూక్లిన్ సహా పలు ప్రాంతాల్లోని వినియోగదారులు సిగ్నల్ సమస్య ఎదుర్కొన్నారు. ఒకే సమయంలో ఈ నెట్‌వర్క్‌లన్నింటిలో సమస్య తలెత్తడం చర్చనీయాంశంగా మారింది. సైబర్ దాడిపై అనుమానం వ్యక్తం చేస్తూ అనేక మంది సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.