మయన్మార్ ప్రజా నాయకురాలు ఆంగ్ సాన్ సూకీ (78) జైలు శిక్ష వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. సాన్ సూకీ జైలు శిక్షను సైనిక ప్రభుత్వం కొంత మేర తగ్గించింది. బుద్ధుడు తొలి ధర్మోపదేశం-ధర్మచక్ర పరివర్తన సూత్రాన్ని ప్రవచించిన పర్వదినమైన ఆగస్టు 1న క్షమాభిక్ష పొందిన 7,749 మంది ఖైదీల్లో ఆమె ఒకరిగా నిలిచారు. సూకీకి 19 కేసుల్లో విధించిన 33 ఏళ్ల జైలు శిక్షలో ఆరేళ్లు మాత్రమే తగ్గించినందున ఆమె ఇంకా 27 ఏళ్లపాటు జైల్లో మగ్గక తప్పదు.
మరోవైపు.. సైనిక ప్రభుత్వం సూకీని జైలు నుంచి రాజధాని నేపీడాలోని ఆమె నివాసానికి మార్చినట్లు అనధికార వార్తలు వచ్చాయి. మయన్మార్‌లో అత్యవసర పరిస్థితిని మరో ఆరు నెలలు పొడిగిస్తున్నామని, తద్వారా ఎన్నికల నిర్వహణకు అనుకూలమైన వాతావరణాన్ని ఏర్పాటు చేయదలిచామని సైనిక ప్రభుత్వం తెలిపింది. 2021 ఫిబ్రవరి 1న.. ఎన్నికైన ప్రభుత్వం నుంచి అధికారాన్ని చేజిక్కించుకున్న సైనిక ప్రభుత్వం సూకీని అదే రోజు అరెస్టు చేసింది.