జనాభా, ఆర్థిక సమస్యలతో చైనా సతమతం అవుతోందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. ఏ క్షణమైనా పేలడానికి సిద్ధంగా ఉన్న టైమ్ బాంబులా చైనా పరిస్థితి ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం దేశ పరిస్థితి.. మిగిలిన ప్రపంచాన్ని భయపెడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం రోజున యూటాలోని పార్క్‌సిటీలో విరాళాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా బైడెన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
“చైనాలో వృద్ధి మందగించింది. దీనికి తోడు అక్కడ పనిచేసేవారి కంటే రిటైరైపోయేవారి సంఖ్యే అధికంగా ఉంది. ఇది మరింత సమస్యాత్మకంగా మారింది. ఆ దేశంలో ప్రస్తుతం అత్యధిక నిరుద్యోగ రేటు కొనసాగుతోంది. దీంతో వారు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. అది ఏమాత్రం మంచిది కాదు. సాధారణంగా చెడ్డవారికి సమస్యలుంటే.. వారు మరింత చెడు పనులే చేస్తారు’’ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘బీజింగ్ చర్యలను వాషింగ్టన్ జాగ్రత్తగా గమనిస్తోంది. చైనాతో పోరును మేం కోరుకోవడంలేదు’ అని బైడెన్ వెల్లడించారు.