భారత్, జపాన్‌లను తక్కువ చేసేలా అమెరికా అధ్యక్షుడు బైడెన్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమైన నేపథ్యంలో వైట్ హౌజ్ క్లారిటీ ఇచ్చింది. బైడెన్కు ఆయా దేశాల పట్ల అమితమైన గౌరవం ఉందని పేర్కొంటూ ఓ ప్రకటన జారీ చేసింది. ఆయన వ్యాఖ్యలు విశాల దృక్పథంతో చేసినవని సమర్థించుకుంది. ముఖ్యంగా భారత్పై బైడెన్కు చాలా గౌరవం ఉందని చెప్పుకొచ్చింది.
విదేశీ వలసదారులను తమ దేశంలోకి అనుమతించేందుకు భారత్ భయపడుతుందని బుధవారం రోజున బైడెన్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. చైనా, రష్యా, జపాన్‌లదీ అదే పరిస్థితి అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై స్పందిస్తూ వైట్ హౌస్ అధికార ప్రతినిధి కరీన్ జీన్ పియర్.. ‘‘అధ్యక్షుడు బైడెన్ ఎంత గౌరవిస్తారో మా మిత్రదేశాలు, భాగస్వాములకు బాగా తెలుసు. ఆయన అమెరికా గురించి మాట్లాడుతూ.. వలసదారులు దేశానికి ఎంత కీలకమో, వారు ఆర్థిక వ్యవస్థను ఎలా బలోపేతం చేస్తారో చెప్పారు. ఈ వ్యాఖ్యలను విస్తృత అర్థంలో తీసుకోవాల్సి ఉంటుంది. జపాన్, భారత్‌తో మాకు బలమైన సంబంధాలున్నాయి. మూడేళ్లుగా వాటిని మరింత పటిష్ఠపర్చేందుకు కృషి చేశాం’’ అని వివరించారు.