కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతన్నలు నానా ఇక్కట్లు పడుతున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేటలోని రోడ్ షోలో పాల్గొన్న హరీశ్ అమలుకు సాధ్యం కాని హామీలతో హస్తం అధికారంలోకి వచ్చిందని వ్యాఖ్యానించారు. ఎవరు పని చేస్తారో.. ఎవరు మాటలు చెబుతారో.. ప్రజలు గ్రహించి.. లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని కోరారు.
“ప్రాజెక్టులు కట్టింది మేం.. పనులు చేసింది మేం. ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చి గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేశాం. బండి సంజయ్ ఐదేళ్లుగా కేంద్రం నుంచి ఒక్క రూపాయి తేలేదు. కాంగ్రెస్ వచ్చిన 4 నెలల్లోనే మోటార్లు కాలుతున్నాయి. తండాలను పంచాయతీలు చేసింది.. లంబాడీలకు మంత్రి పదవి ఇచ్చింది మేమే. అబద్ధాలు చెప్పి మోసం చేసిన కాంగ్రెస్‌కు ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి. కాంగ్రెస్ ప్రభుత్వంలో లంబాడీలకు మంత్రి పదవి రాలేదు. లంబాడీల అభివృద్ధికి కేసీఆర్ అనేక కార్యక్రమాలు చేపట్టారు. ఎవరు పనిచేస్తారో.. ఎవరు మాటలు చెబుతారో.. ప్రజలు గ్రహించాలి. గుంపు మేస్త్రికి మాటలు ఎక్కువ.. చేతలు తక్కువ.” అని హరీశ్ రావు విమర్శించారు.