వచ్చే ఏడాది జరగనున్న భారత గణతంత్ర దినోత్సవానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హాజరవనున్నారన్న సంగతి తెలిసిందే. అయితే బైడెన్ భారత్ పర్యటన రద్దయినట్లు సమాచారం. ఆయన భారత గణతంత్ర వేడుకలకు హాజరుకాకపోవచ్చని తెలుస్తోంది. కొద్దినెలల క్రితం జీ20 సదస్సు సందర్భంగా నిర్వహించిన ద్వైపాక్షిక చర్చల్లో భాగంగా బైడెన్‌తో ప్రధాని మోదీ మాట్లాడారని, గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా రావాల్సిందిగా అధ్యక్షుడిని ఆహ్వానించారని అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి గతంలో వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా బైడెన్ పర్యటన రద్దయినట్లు సమాచారం. దీనికి సంబంధించిన కారణాలు తెలియాల్సి ఉంది.
మరోవైపు భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాతో కూడిన క్వాడ్ సదస్సుకు వచ్చే ఏడాది భారత్ ఆతిథ్యం ఇవ్వనుందనే ప్రతిపాదనపైనా అధికారిక స్పందన వెలువడాల్సి ఉంది. బైడెన్ గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా వస్తే ఆ తర్వాతి రోజు (జనవరి 27న) క్వాడ్ సదస్సును నిర్వహించొచ్చనే వార్తలు వచ్చాయి. ఇప్పుడు బైడెన్ పర్యటన ఉండకపోవచ్చనే వార్తలతో క్వాడ్ సదస్సు కూడా వాయిదా పడనున్నట్లు తెలుస్తోంది.