బోయింగ్ విమానాల తయారీలో నాణ్యతా లోపాలను ఎత్తిచూసిన మాజీ ఉద్యోగి జాన్ బార్నెట్ అనుమానాస్పదంగా మృతి చెందాడు. దక్షిణ కరోలినాలోని ఓ హాటల్ పార్క్‌లోని ట్రక్కులో ఆయన నిర్జీవంగా పడి ఉండడాన్ని పోలీసులు గుర్తించారు. ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమిక విచారణ అనంతరం పోలీసులు తెలిపారు. బెర్నెట్ ఈ నెల 9న ఓ విచారణకు హాజరు కావాల్సింది. కానీ, ఆయన రాకపోవటంతో హోటల్‌లో ఆరా తీయగా చివరకు ట్రక్కులో విగతజీవిగా పడి ఉండడాన్ని గుర్తించారు.
దాదాపు 32 ఏళ్ల పాటు బోయింగ్ కంపెనీలో పనిచేసిన ఆయన 2017లో అనారోగ్య కారణాలతో ఉద్యోగ విరమణ చేశారు. బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ తయారు చేసే దక్షిణ చార్లెస్టన్ ప్లాంటులో బెర్నెట్ 2010 నుంచి క్వాలిటీ మేనేజర్‌గా పనిచేశారు. ఉద్యోగులకు కంపెనీ కొన్ని లక్ష్యాలను నిర్దేశించి వాటిని చేరుకోవడానికి గడువు విధిస్తుండటం వల్ల ఒత్తిడికి గురై నాణ్యత విషయంలో రాజీ పడాల్సి వస్తోందని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు బార్నెట్. మరోవైపు 787 డ్రీమ్‌లైనర్‌లో ఆక్సిజన్ వ్యవస్థలను పరీక్షించినప్పుడు 25 శాతం విఫలమయ్యాయని, అత్యవసర సమయంలో ప్రతి నాలుగు ఆక్సిజన్ మాస్కుల్లో ఒకటి పనిచేయకపోయే ప్రమాదం ఉందని తెలిపారు.