ఫ్రాన్స్ పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు హంగ్ దిశగా సాగుతున్నాయి. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ పార్టీకి అధికారం చేపట్టడానికి కావాల్సిన మెజారిటీ వచ్చేలా లేవు. ఫ్రాన్స్ పార్లమెంట్ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ వచ్చేలా కనిపించడం లేదని సమాచారం. 577 స్థానాలున్న ఫ్రాన్స్ జాతీయ అసెంబ్లీలో అధికారం చేపట్టాలంటే ఏ పార్టీ అయినా 289 సీట్లు సాధించాలి. ఈ ఎన్నికల్లో అనూహ్యరీతిలో వామపక్ష కూటమి పుంజుకుంది.
ఈరోజు ఉదయానికి వెలువడిన ఫలితాల ప్రకారం వామపక్ష కూటమి 180 స్థానాల్లో విజయం సాధించింది. మెక్రాన్ కూటమి 160 స్థానాలతో రెండో స్థానంలో, అతి మితవాద కూటమి 140 సీట్లలో విజయంతో మూడోస్థానంలో నిలిచింది. ప్రస్తుత అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ ఈసారి అతి మితవాద పక్షాలతో కలిసి పాలన సాగించడం అనివార్యమయ్యేలా ఉంది. అంటే ఫ్రాన్స్ పార్లమెంట్ ఎన్నికల్లో ఈ హంగ్ తప్పేలా లేదు. ఒకవేళ హంగ్ వస్తే ఫ్రాన్స్ పార్లమెంట్ ఎన్నికల ఆధారంగా జాతీయ అసెంబ్లీని ఏ పార్టీ దక్కించుకుంటుంది, ప్రధాని పగ్గాలు ఎవరికి దక్కుతాయి అనేది ఆసక్తికరంగా మారింది.