కరోనా మహమ్మారి చైనాలో విలయం సృష్టించింది. ఆ దేశాన్ని ఆర్థికంగా నష్టపరచడమే కాకుండా జనాభాను క్షీణింపజేసింది. కరోనా ఆంక్షలు ఎత్తేయడంతో అక్కడి ప్రజల ప్రాణాలు పిట్టలు రాలినట్లు రాలిపోయాయి. దీంతో చైనాలో జనాభా వరుసగా రెండో ఏడాది క్షీణించింది. జననాలతో పోలిస్తే మరణాలు అధికంగా నమోదవుతుండటం వల్ల గతేడాది (2023)లో జనాభా 20 లక్షల మేర తగ్గినట్లు ప్రభుత్వ అధికారులు తెలిపారు. అంతకుముందు ఏడాదితో పోలిస్తే మొత్తం మరణాల సంఖ్య రెట్టింపు అయిందని చెప్పారు.
2023లో ఏకంగా 6 లక్షల 90వేల మరణాలు సంభవించాయని ప్రభుత్వ గణాంకాలు స్పష్టం చేశాయి. ప్రస్తుతం దేశ మొత్తం జనాభా 140 కోట్లుగా ఉన్నట్లు వెల్లడించింది. ఎప్పటిలాగే జననాల సంఖ్య కూడా తక్కువగానే నమోదైందని పేర్కొంది. 2023లో 90 లక్షల మంది జన్మించగా.. 2016లో పుట్టిన శిశువుల సంఖ్యలో ఇది సగమేనని గణాంకాలు వెల్లడించాయి. వరుసగా ఏడో సంవత్సరం జననాలు తగ్గుముఖం పట్టినట్లు తెలిపాయి. మరోవైపు దేశ జనాభా సగటు వయసు క్రమంగా పెరుగుతోందని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది.