లడఖ్ గాల్వన్ లోయ ఉదంతం అనంతరం చైనాపై భారత్ తీవ్రమైన ఆగ్రహంతో ఉంది. జనాలు ఆ దేశ వస్తువులను వాడేది లేదని ఖరాఖండిగా చెప్పేస్తున్నారు. దీంతో కేంద్రం కూడా ఇదే విషయంపై ఆలోచనలు చేస్తోంది. చైనా వస్తువులపై నిషేధం విధించాలనే యోచనలో కేంద్రం ఉన్నట్లు తెలిసింది. అయితే దీంతోపాటు చైనా నుంచి భారత్ దిగుమతి చేసుకునే అనేక రకాల వస్తువులపై భారీగా కస్టమ్స్ సుంకాన్ని పెంచనున్నట్లు తెలిసింది.
భారత్ ఇతర దేశాలన్నింటి నుంచి దిగుమతి చేసుకునే వస్తువుల్లో చైనా దిగుమతుల శాతం 14 గా ఉంది. 2019 ఏప్రిల్ నుంచి 2020 ఫిబ్రవరి మధ్య కాలంలో భారత్ చైనా నుంచి మొత్తం 62.4 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులను దిగుమతి చేసుకోగా.. మనం దేశం నుంచి ఆ దేశానికి ఎగుమతి అయిన వస్తువుల విలువ 15.5 బిలియన్ డాలర్లుగా నమోదైంది. చైనా నుంచి భారత్ దిగుమతి చేసుకునే వస్తువుల్లో ఎక్కువగా గోడ గడియారాలు, వాచ్లు, మ్యూజిక్ పరికరాలు, బొమ్మలు, క్రీడా సామగ్రి, ఫర్నిచర్, పరుపులు, ప్లాస్టిక్ వస్తువులు, ఎలక్ట్రికల్ యంత్రాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, కెమికల్స్, ఇనుము, స్టీల్ వస్తువులు, ఫెర్టిలైజర్లు, మినరల్ ఫ్యుయల్, పలు లోహాలు ఉన్నాయి. అయితే భారత్ వీటి దిగుమతిపై కస్టమ్స్ సుంకం పెంచితే ఈ వస్తువుల ధరలు మన దగ్గర భారీగా పెరుగుతాయి. అదే సమయంలో దేశీయంగా ఉత్పత్తి అయ్యే ఇవే వస్తువులు తక్కువ ధరలకు లభిస్తాయి. దీంతో సహజంగానే చైనా నుంచి దిగుమతి అయ్యే వస్తువుల విలువ తగ్గుతుంది. అందుకనే భారత్ ప్రస్తుతం చైనా నుంచి దిగుమతి అయ్యే ఆయా వస్తువులపై కస్టమ్స్ సుంకాన్ని భారీగా పెంచాలని అనుకుంటోంది. కానీ దీనిపై ఇంకా కేంద్రం నిర్ణయం తీసుకోలేదు.
చైనా నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై కస్టమ్స్ సుంకాన్ని పెంచడం వల్ల మోదీ ప్రవేశపెట్టిన మేకిన్ ఇండియాకు మరింత ఊతం లభిస్తుంది. దీంతోపాటు కరోనా వల్ల పతనమైన దేశ ఆర్థిక వ్యవస్థ మళ్లీ గాడిలో పడుతుంది. అనేక పరిశ్రమలు మళ్లీ ప్రారంభమై ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఏర్పడుతాయి. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. అయితే కేంద్రం తీసుకునే నిర్ణయం మనకు స్వల్పకాలికంగా ఆయా వస్తువుల లభ్యతకు ఆటంకం కలిగించినా దీర్ఘకాలికంగా అది మనకు పెద్ద ప్లస్ పాయింట్ అవుతుంది. అదే సమయంలో చైనా భారీ ఎత్తున ఆదాయం కోల్పోతుంది. నిజానికి మనం అక్కడికి ఎగుమతి చేసే వస్తువుల కన్నా అక్కడి నుంచి ఇక్కడికి దిగుమతి చేసుకునే వస్తువుల విలువే ఎక్కువ. అందువల్ల భారత్తో చైనా కయ్యానికి కాలు దువ్వితే నష్టపోయేది వారేనని చెప్పవచ్చు.