దేశంలో కోవిడ్ సెకండ్ వేవ్ ప్రభావం కొనసాగుతోంది. రోజుకు 3 లక్షలకు పైగా కొత్త కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే హాస్పిటళ్లలో బెడ్లు, వైద్య సదుపాయాల కొరత ఏర్పడింది. మరోవైపు కరోనా చికిత్సకు ఉపయోగించే మందులు, కరోనా టీకాల కొరత ఉంది. ఈ క్రమంలో పెద్ద ఎత్తున సదుపాయాలను కల్పించడం కోసం కృషి చేస్తున్నామని కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది. అయితే ఈ ఏడాది కరోనా ప్రభావం ఇంకా తీవ్రంగా ఉండబోతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కోవిడ్ సెకండ్ వేవ్ ఇప్పటికే అనేక దేశాల్లో తీవ్రంగా ఉంది. ఈ ఏడాది కరోనా ప్రభావం విపరీతంగా ఉంటుంది. రానున్న రోజుల్లో కరోనా అత్యంత ప్రమాదకరంగా మారుతుంది.. అని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అధనమ్ ఘెబ్రెయిసస్ వెల్లడించారు. భారత్‌లో కోవిడ్ వ్యాప్తిపై ఆందోళనగా ఉందని, వెంటనే కోవిడ్‌ను నియంత్రించే చర్యలు చేపట్టకపోతే మరింత ప్రమాదంగా మారుతుందని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వాలు ఈ విషయంలో చురుగ్గా వ్యవహరించాలని, లేదంటే రానున్న రోజుల్లో ఎదురయ్యే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవడం కష్టంగా మారుతుందన్నారు.
కాగా ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో కోవిడ్ ప్రభావం ఉన్నప్పటికీ భారత్‌లో చాలా ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు ఆంథోనీ ఫౌచీ సహా, ఇతర వైద్య నిపుణులు, సైంటిస్టులు దేశవ్యాప్త లాక్‌డౌన్ విధిస్తేనే కరోనా కట్టడి సాధ్యమవుతుందని ఇప్పటికే తెలిపారు. అయితే కేంద్రం ఈ విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు.