అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్న మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ వరుస విజయాలతో దూసుకెళ్తున్నారు. రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో జోరు సాగిస్తున్నారు. తాజాగా జరిగిన దక్షిణ కరోలినా ప్రైమరీ ఎన్నికల్లోనూ ఆయన విజయం సాధించారు. ఇప్పటికే న్యూ హాంప్‌షైర్, నెవడా, ఐయోవా, వర్జిన్ ఐలాండ్స్‌లో ట్రంప్ గెలుపొందిన విషయం తెలిసిందే.
అయితే సొంత రాష్ట్రంలోనూ మరో అభ్యర్థి నిక్కీ హేలీకి ఓటమి తప్పలేదు. ఇప్పటికీ పోటీ నుంచి వైదొలగడానికి హేలీ అంగీకరించడం లేదు. మార్చి 5వ తేదీన పలు రాష్ట్రాల్లో జరిగే ప్రైమరీల్లోనూ తాను రేసులో ఉంటానని ఆమె ప్రకటించడం గమనార్హం. గతంలో నిక్కీ హేలీ దక్షిణ కరోలినాకు గవర్నర్‌గా పని చేసినా తాజా ప్రైమరీలో ఆమెకు మద్దతు కరవైంది. ఇక ఇప్పటి వరకు ఉన్న ఫలితాల ప్రకారం రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత యూఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్, డొనాల్డ్ ట్రంప్ మధ్య మరోసారి హోరా హోరీ పోటీ తప్పదనే విశ్లేషణలు వెలువడుతున్నాయి.