అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. రిపబ్లికన్ల తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో ముందంజలో ఉన్న భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామి ప్రచారంలో జోష్ చూపిస్తున్నారు. అయితే తాజాగా వివేక్ చేసిన ఓ పని గ్రామీ అవార్డు విన్నర్, ప్రముఖ ర్యాపర్ ఎమినెమ్ను అసహనానికి గురి చేసింది. వివేక్ తన అనుమతి లేకుండా తాను పాడిన పాటలను ఎన్నికల ప్రచారానికి వినియోగించుకోవడంపై ఎమినెమ్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. తన మ్యూజిక్‌ను వాడుకోవద్దని ఎమినెమ్ కాస్త గట్టిగానే చెప్పారు.
అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం జోరుగా ప్రచారం చేస్తున్నవివేక్ రామస్వామి లోవా స్టేట్ ఫెయిర్‌లో తన ర్యాప్ స్కిల్‌ను ప్రదర్శించారు. ర్యాప్ స్టార్ ఎమినెమ్ ఆలపించిన ‘లూజ్ యువర్‌సెల్ఫ్’ పాటను వివేక్ పాడి.. శ్రోతలను ఆకట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇటీవల నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై స్పందించిన ఎమినెమ్ ఎన్నికల ప్రచారానికి తన మ్యూజిక్‌ను వినియోగించుకోవద్దని కోరాడు. ఈ మేరకు వివేక్ రామస్వామికి అధికారికంగా లేఖ పంపినట్లు అమెరికా మీడియా కథనాలు వెల్లడించాయి.