టర్కీలో తనకు తిరుగులేదని మరోసారి నిరూపించారు తయిప్ ఎర్దొగాన్. ఆ దేశాధ్యక్ష ఎన్నికల్లో వరుసగా మూడోసారి విజయఢంకా మోగించారు. హ్యాట్రిగ్ ప్రెసిడెంట్‌గా చరిత్ర సృష్టించారు. రెండు దశాబ్దాలుగా టర్కీ పాలకుడిగా కొనసాగుతున్న ఎర్దొగాన్.. తాజాగా జరిగిన ఎన్నికల్లో 52 శాతం ఓట్లు సాధించినట్లు ప్రభుత్వ వార్తా సంస్థ అనడోలు న్యూస్ ఏజెన్సీ ప్రకటించింది. ప్రత్యర్థి కెమల్‌కు 48 శాతం ఓట్లు వచ్చాయని పేర్కొంది.
ఆసియా, ఐరోపా ఖండాల్లో విస్తరించి ఉన్న టర్కీకి ఎర్డోగాన్ ప్రధానిగా, అధ్యక్షుడిగా పనిచేశారు. ఇప్పుడు మళ్లీ అధికారంలోకి వస్తే మూడో దశాబ్దంలోకి ప్రవేశించినట్లువుతుంది. అయితే దేశంలో అధిక ద్రవ్యోల్బణం, భారీ భూకంపం తర్వాత జరిగిన ఎన్నికల్లోనూ ఆయన విజయం సాధించడం విశేషం. ఫిబ్రవరి నెలలో వచ్చిన భూకంపం సమయంలో ఎర్డోగాన్ ప్రభుత్వం సరిగా స్పందించలేదని ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైన విషయం తెలిసిందే.
మరో ఐదేళ్లపాటు తనకు అధ్యక్ష పదవి అప్పగించినందుకు దేశ ప్రజలకు ఎర్దొగాన్ ధన్యవాదాలు తెలిపారు. ఫలితాలు వెలువడిన తర్వాత ఇస్తాంబుల్‌లోని ఇంటి వెలుపల తన మద్దతుదారులతో మాట్లాడారు.