గాజాలో మరో విషాదం చోటు చేసుకొంది. మానవతా సాయం గాజా పౌరుల పాలిట మృత్యుపాశమైంది. ఆహారం కోసం క్యూలో ఎదురుచూస్తున్న గాజా వాసులపై విమానాల నుంచి జారవిడిచిన ఆహార ప్యాకెట్ల పారాచ్యూట్ కూలింది. భారీ ఎత్తున ఆహార పార్సిళ్లు పడడంతో ఐదుగురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు.
ఓవైపు ఇజ్రాయెల్ దాడులతో గాజా వాసుల పరిస్థితి దయనీయంగా మారిన విషయం తెలిసిందే. యుద్ధం వల్ల అక్కడి పౌరులు ఆకలి బాధతో అలమటిస్తున్నారు.వారి ఆకలిని తీర్చేందుకు అమెరికా, జోర్డాన్, బెల్జియం, ఈజిప్ట్, ఫ్రాన్స్, నెదర్లాండ్స్ దేశాలు ముందుకొచ్చి ఎయిర్‌డ్రాప్‌ల ద్వారా ఆహార పొట్లాలను జారవిడుస్తున్నాయి. ఉత్తర గాజాలోని ఒక శిబిరం వద్ద ఆహారప్యాకెట్ల కోసం ఎదురుచూస్తున్న పౌరులపై పారాచ్యూట్ కూలినట్లు స్థానిక మీడియా తెలిపింది. సమయానికి అది తెరుచుకోకపోవడమే ఈ ప్రమాదానికి కారణమని పేర్కొంది. దీంతో ఐదుగురు మృతి చెందగా.. పది మంది గాయపడ్డారని వెల్లడించింది. క్షతగాత్రులను స్థానికులు ఆల్-షిఫా ఆస్పత్రికి తరలించారు.