మేడిగడ్డ సహా అన్నారం, సుందిళ్ల ఆనకట్టలపై అధ్యయనం కోసం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) ఏర్పాటు చేసిన కమిటీ ఇవాళ రాష్ట్ర నీటి పారుదల శాఖ అధికారులు, ఇంజనీర్లతో సమావేశమైంది. రాష్ట్ర పర్యటనకు వచ్చిన చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని కమిటీ రెండు రోజుల పాటు మూడు ఆనకట్టలను పరిశీలించింది. ఆనకట్టలకు సంబంధించిన పరీక్షలు, డిజైన్స్, నిర్మాణం, నాణ్యత, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ అంశాలపై అధ్యయనం చేసింది.
మేడిగడ్డ ఆనకట్టలో కుంగిన పియర్స్, పగుళ్లు, దెబ్బతిన్న ప్రాంతాల్ని ఈ కమిటీ సభ్యులు పరిశీలించారు. అన్నారం ఆనకట్టలో సీపేజీ వచ్చిన ప్రాంతంతో పాటు సుందిళ్ల ఆనకట్టను సందర్శించారు. క్షేత్ర స్థాయి పర్యటన అనంతరం ఇవాళ హైదరాబాద్ జల సౌధలో నీటిపారుదల శాఖ అధికారులు, ఇంజనీర్లు, ఏజెన్సీలతో సమావేశం అయ్యారు. 2016 నుంచి ఆనకట్టల బాధ్యతలు నిర్వర్తించిన ఇంజినీర్లు అందరినీ సమావేశానికి రావాలని ఆదేశించారు. బదిలీ అయిన, పదవీ విరమణ చేసిన వారు కూడా సమావేశానికి రావాలని స్పష్టం చేశారు. అందరితో చర్చించిన అనంతరం చంద్రశేఖర్ నేతృత్వంలోని కమిటీ సాయంత్రం తిరిగి దిల్లీ బయల్దేరి వెళ్లనుంది.