మొస‌లికి గుణ‌పాఠం చెప్పాల‌ని గోల్ఫ్ కోర్స్ నుంచి దొంగిలించాడు.. త‌రువాత ఏమైందంటే..?

ప్ర‌పంచంలోని మ‌నుషులంద‌రూ ఒకేలా ఉండ‌రు. కొంద‌రి మాన‌సిక స్థితి స‌రిగ్గానే ఉంటుంది. అయితే కొంద‌రి స్థితి వేరేగా ఉంటుంది. దీంతో వారు చిత్రాతి చిత్ర‌మైన పనులు చేస్తుంటారు. స‌మ‌స్య‌ల్లో ఇరుక్కుంటుంటారు. అమెరికాలోని ఫ్లోరిడాలోనూ స‌రిగ్గా ఇలాగే జ‌రిగింది. ఓ వ్య‌క్తి గోల్ఫ్ కోర్స్ నుంచి  చిన్న మొస‌లిని దొంగిలించాడు. త‌రువాత ఇబ్బందుల్లో ఇరుక్కున్నాడు. ఇంత‌కీ అస‌లు ఏం జ‌రిగిందంటే..?

ఫ్లోరిడాకు చెందిన 32 ఏళ్ల ఓ వ్య‌క్తి అక్క‌డి ఓ మినియేచ‌ర్ గోల్ఫ్ కోర్స్‌లోని స‌రస్సులో ఉన్న మొస‌లిని దొంగిలించాడు. దాన్ని అక్క‌డికి స‌మీపంలోని హైవే ఎ1ఎ అనే ప్రాంతంలో ఉన్న కాక్‌టెయిల్ లాంజ్‌లోని పైక‌ప్పు మీద‌కు విస‌రాల‌నుకున్నాడు. ఈ క్ర‌మంలోనే దాని తోక‌ను ప‌ట్టుకుని అటు ఇటు బండకు బాదిన‌ట్టు బాదాడు. ఆ దృశ్యాల‌ను పోలీసులు గ‌మ‌నించి అత‌న్ని అరెస్టు చేశారు.

అయితే ఇలా ఎందుకు చేశావ‌ని అడిగితే ఆ మొస‌లికి గుణ‌పాఠం చెప్పాల‌ని చూశాన‌ని, అందుక‌నే దాన్ని దొంగిలించాన‌ని చెప్పాడు. దీంతో పోలీసులు అత‌ని మాట‌ల‌ను విని నివ్వెర‌పోయారు. అయితే ఇలాంటి చిత్ర‌మైన సంఘ‌ట‌న‌ల‌కు ఫ్లోరిడా ఇటీవ‌ల వేదిక అవుతోంది.

ఇటీవ‌లే ఓ వ్య‌క్తి అక్క‌డి స్టార్ బ‌క్స్ డ్రైవ్ త్రూ వ‌ద్ద‌కు వెళ్లి త‌న‌కు క్రీమ్ చీజ్ వేయ‌లేద‌ని అందులో ఉన్న ఓ మ‌హిళా ఉద్యోగిపై గ‌న్ గురి పెట్టాడు. కానీ అక్క‌డ ఎలాంటి హింసా చోటు చోసుకోలేదు. ఇక ఓ మ‌హిళ త‌న‌కు త‌న పెర‌ట్లో ఓ చిన్న డైనోసార్ క‌నిపించింద‌ని వ్యాఖ్య‌లు చేసింది. సాక్ష్యంగా ఓ వీడియోను కూడా చూపించింది. కానీ అందులో ఓ పెద్ద ప‌క్షి ఉండ‌డం విశేషం. ఇలా అక్క‌డి వారు ఎందుకు ప్ర‌వ‌ర్తిస్తున్నారో అర్థం కాక అధికారులు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు.