తెలంగాణలో కొత్తగా పార్టీ పెట్టిన షర్మిల సరికొత్తగా రాజకీయాలు చేస్తూ ముందుకెళుతున్నారు. వైఎస్సార్ తెలంగాణ పార్టీ పెట్టి ముందుకెళుతున్న షర్మిల, ఒక సీనియర్ నాయకురాలు మాదిరిగా మాట్లాడుతూ, రాష్ట్రంలో ఉన్న మిగిలిన పార్టీలపై విమర్శలు చేస్తున్నారు.
కేసీయార్, కేటీయార్ల పై ఆరోపణలు, విమర్శలతో డైరెక్టుగా బాణాలు ఎక్కుపెడుతున్నారు. పార్టీ నేతలతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడిన షర్మిల వ్యవహారం చూస్తుంటే ముందు ముందు తన జోరును మరింతగా పెంచబోతున్నట్లే అనిపిస్తోంది. కేటీయార్ అంటే ఎవరు అని మీడియానే అడిగారు. ఎవరో పక్కనుండి చెప్పింది విని ‘ఓహో కేసీయార్ కొడుకా’ ? అంటే కేటీయార్ అంటే తెలియక కాదు కావాలనే ఎద్దేవా చేశారు.
ఎందుకంటే కేటీయార్ మాట్లాడుతు షర్మిలను చులకనగా మాట్లాడారు. ఏదో సమావేశంలో మాట్లాడుతు షర్మిల ఒక్కరోజు వ్రతం చేస్తున్నారు అంటు చులకనగా మాట్లాడారు. ఉద్యోగాల భర్తీకోసం మొన్నటి మంగళవారం షర్మిల చేసిన దీక్షను కేటీయార్ తనదైన స్టైల్లో ఎద్దేవా చేశారు. దానికి రివర్స్‌లోనే షర్మిల అసలు కేటీయార్ ఎవరంటూ ఎదురుదాడికి దిగారు. కేసీయార్‌కే మహిళలంటే గౌరవం లేనపుడు ఇక ఆయన కొడుక్కు మాత్రం మహిళలంటే గౌరవం ఎందుకుంటుందని దులిపేశారు.
టీఆర్ఎస్ లో ఎంతమంది మహిళలున్నారు ? ఎంతమందికి టికెట్లిచ్చి పోటిచేయించారు ? ఎతమందిని గెలిపించుకున్నారు ? ఎంతమందిని మంత్రులను చేశారంటూ సూటిగా కేసీయారేనే నిలదీశారు. మంత్రివర్గంలో ఒక్క మహిళైనా ఉన్నారా ? అంటూ గట్టిగానే అడిగారు. అంటే సబితా ఇంద్రారెడ్డి మంత్రగా ఉన్నా ఆమె కాంగ్రెస్ లో నుండి ఫిరాయించిన ఎంఎల్ఏ. టీఆర్ఎస్ లో గెలిచిన మహాళల్లో ఎవరికీ మంత్రి పదవి ఇవ్వలేదన్నది షర్మిల వాదన.
కేటీయార్ దృష్టిలో మహిళలు వంటింట్లో ఉండాలి..వ్రతాలు చేసుకోవాలి అంతేనా ? అంటూ నిలదీశారు. మొత్తానికి డైరెక్టుగా తండ్రి, కొడుకులపైనే ఆరోపణలు, విమర్శలను షర్మిల పెంచేస్తున్నారు. అయితే షర్మిల ఈ విమర్శలన్నీ చాలా కాన్ఫిడెంట్‌గా చేస్తున్నారు. గతంలో ఏపీలో ఎన్నికల ప్రచారం సందర్భంగా కేటీయార్‌ని పొగిడి, ఇప్పుడు ఎవరని మాట్లాడటం వెనుక రాజకీయం ఉందని అర్ధమవుతుంది. అయితే రానున్న రోజుల్లో షర్మిలాది కాన్ఫిడెన్స్ అవుతుందో, ఓవర్ కాన్ఫిడెన్స్ అవుతుందో చూడాలి. అలాగే ఆమెని తెలంగాణ ప్రజలు పట్టించుకుంటారో లేదో కూడా చూడాలి.