తోషాఖానా అవినీతి కేసులో దోషిగా తేలి, జైలుకెళ్లిన పాకిస్థాన్ మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్‌కు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సాధారణ ఎన్నికలకు ముందు ఆయనకు.. పాకిస్థాన్ ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. ఎన్నికల్లో ఐదేళ్లపాటు పోటీ చేయకుండా.. ఆయనపై అనర్హత వేటు వేసింది. తోషాఖానా కేసులో న్యాయస్థానం ఇమ్రాన్ ఖాన్‌కు మూడేళ్ల జైలు శిక్ష విధించడం వల్ల.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు పాకిస్థాన్ ఎన్నికల సంఘం తెలిపింది. కొన్ని నెలల్లోనే పాకిస్థాన్‌లో సాధారణ ఎన్నికలు జరగనుండగా.. ఈసీ నిర్ణయంతో ఇమ్రాన్ ఖాన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లైంది.
పాకిస్థాన్ పార్లమెంటు గడువు ఆగస్టు 12 వరకు ఉండగా.. ఆగస్టు 9న దిగువ సభ రద్దుకు సిఫార్సు చేస్తానని ఇప్పటికే ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రకటించిన విషయం తెలిసిందే. మరోవైపు.. ట్రయల్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఇమ్రాన్ ఖాన్.. ఇస్లామాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తమ వాదనలు వినకుండానే ట్రయల్ కోర్టు జడ్జి తీర్పు ఇచ్చారని.. ఇమ్రాన్ పిటిషన్‌లో పేర్కొన్నారు.