ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. ఆయన హఠాన్మరణం ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఆదివారం దట్టమైన అటవీ ప్రాంతంలో కూలిపోవడంతో రైసీతో పాటు హెలికాప్టర్‌లో ఉన్నవారంతా దుర్మరణం చెందినట్లు ఆ దేశ అధికారిక మీడియా ధ్రువీకరించింది. అయితే ఈ ప్రమాదానికి ముందు రైసీ చివరి ఫొటో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.
అధ్యక్షుడు రైసీ ఇతర అధికారులతో కలిసి హెలికాప్టర్‌లో ప్రశాంతంగా కూర్చుని బయటకు చూస్తున్న ఫొటో అది. ఇరాన్ – అజర్‌బైజాన్ సరిహద్దుల్లో డ్యాంలను ప్రారంభించిన అనంతరం అక్కడి నుంచి అధ్యక్షుడు తిరుగుపయనమైన దృశ్యాలను నిన్న ఇరాన్ మీడియా ప్రసారం చేసింది. ఆ స్క్రీన్‌షాట్లను పలు మీడియా సంస్థలు సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశాయి. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. రైసీ బయల్దేరిన కొద్దిసేపటికే ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది.
రైసీ ప్రమాదం నేపథ్యంలో దేశ కేబినెట్ సోమవారం అత్యవసరంగా సమావేశమైంది. ఇరాన్ ఉపాధ్యక్షుడు మహమ్మద్ మొఖ్బర్ తాత్కాలికంగా దేశాధ్యక్ష బాధ్యతలు చేపట్టే అవకాశాలు కన్పిస్తున్నాయి.