ఆడపిల్లలకు 18 ఏళ్లు దాటిన తర్వాతే వివాహం జరిపించాలని చట్టం చేసినా కొన్ని ప్రాంతాల్లో ఇంకా బాల్యవివాహాలు సాగుతున్నాయి. కానీ ఓ దేశం మాత్రం ఏకంగా అమ్మాయిల వివాహ వయసును 9 సంవత్సరాలకు కుదించాలంటూ పార్లమెంట్‌లో బిల్లు ప్రతిపాదించింది. ఇప్పుడు ఈ బిల్లుపై ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది.
పర్సనల్ స్టేటస్ లాను సవరించే ఉద్దేశంతో ఇరాక్ ప్రభుత్వం దీనిని తీసుకువచ్చారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం.. ఇరాక్‌లో అమ్మాయిల వివాహ వయసు 18 ఏళ్లుగా ఉండగా.. ఈ బిల్లు పాస్ అయితే బాలికలు 9 ఏళ్లు, బాలురు 15 ఏళ్లకు వివాహం చేసుకోవడానికి చట్టపరంగా ఎలాంటి అడ్డంకి ఉండదు. ఈ బిల్లు లింగ సమానత్వం, మహిళల హక్కుల విషయంలో ఇంతకాలం సాధించిన పురోగతిని దెబ్బతీస్తుందని పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ బిల్లు బాలికల విద్య, ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని మానవ హక్కుల సంఘాలు, మహిళా సంఘాలు ఆవేదన చెందుతున్నాయి. దీనివల్ల చదువు మధ్యలో ఆపే ఆడపిల్లల సంఖ్య పెరుగుతుందని, చిన్నవయసులోనే గర్భం దాల్చడం, గృహహింస వంటివి పెచ్చుమీరతాయని ఆగ్రహం వ్యక్తంచేశాయి.