ఇజ్రాయెల్-హమాస్ల మధ్య కాల్పుల విరమణ చర్చలు మరోసారి విఫలమయ్యాయి. ఇజ్రాయెల్‌తో ఈజిప్టులోని కైరోలో తాజాగా జరిగిన కీలక చర్చలు ముగిశాయి. గాజా నుంచి ఇజ్రాయెల్ బలగాల ఉపసంహరణ, యుద్ధం ముగింపు లాంటి హమాస్ కీలక డిమాండ్లను నెతన్యాహు సర్కారు తిరస్కరించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో రఫాతో పాటు గాజాలోని ఇతర ప్రాంతాల్లో అతి త్వరలో భారీ దాడులు చేపడతామని ఇజ్రాయెల్ ప్రకటించింది.
యుద్ధం నిలిపివేయాలనే అంతర్జాతీయ ఒత్తిళ్లకు లొంగిపోయే సమస్యే లేదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తేల్చి చెప్పారు. ఇజ్రాయెల్ ఒంటరిగా నిలబడాల్సి వస్తే, ఒంటరిగానే నిలబడాలని తెలిపారు. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా, ఏ అంతర్జాతీయ వేదిక తీసుకున్న నిర్ణయం అయినా తనను తాను రక్షించుకోకుండా ఇజ్రాయెల్ను ఆపలేవని నెతన్యాహు స్పష్టం చేశారు.
మరోవైపు, హమాస్‌కు అనుకూలంగా పక్షపాతంతో వార్తలను ప్రసారం చేస్తోందన్న అభియోగాలతో అల్-జజీరా అంతర్జాతీయ వార్తా ఛానెల్‌పై ఆదివారం ఇజ్రాయెల్ నిషేధం విధించింది. తమపై విధించిన నిషేధాన్ని అల్-జజీరా ఖండిస్తూ.. అధి మానవహక్కుల ఉల్లంఘనగా పేర్కొంది.