ఇజ్రాయెల్- హమాస్ యుద్ధానికి బ్రేక్ ఇచ్చేందుకు మరోసారి కాల్పుల విరమణ ప్రతిపాదనలు తెరపైకి వచ్చాయి. ఒకవేళ దీనికి ఆమోద ముద్ర లభిస్తే గనుక అది 3 దశల్లో అమలు కానుంది. తమ ప్రతిపాదన లేఖను హమాస్ నేతలు ఖతార్, ఈజిప్టులోని మధ్యవర్తుల బృందానికి పంపినట్లు ఓ ప్రముఖ ఆంగ్ల వార్తా సంస్థ వెల్లడించింది. ఒక్కో దశ 45 రోజుల చొప్పున 3 దశల్లో 135 రోజులపాటు అమలయ్యేలా కాల్పుల విరమణకు సంబంధించిన అంశాలను ఈ ప్రతిపాదనలో హమాస్ పొందుపర్చింది. దీని ప్రకారం పాలస్తీనా ఖైదీలకు బదులుగా మిగిలిన ఇజ్రాయెల్ బందీలను విడుదల చేస్తారు. అంతేకాకుండా గాజా పునర్నిర్మాణం, ఇజ్రాయెల్ దళాల ఉప సంహరణ, మృతదేహాల మార్పిడి వంటి అంశాలను లేఖలో హమాస్ పేర్కొంది.
మరోవైపు హమాస్ నేతల డిమాండ్లకు తలొగ్గేదే లేదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తేల్చిచెప్పారు. విజయానికి అత్యంత చేరువలో ఉన్నామని తెలిపారు. గాజాలో కొన్ని నెలల్లోనే యుద్ధాన్ని ముగిస్తామని, హమాస్‌ను అంతమొందించడం, బందీలను విడిపించుకోవడం, ఇజ్రాయెల్‌కు గాజా ప్రమాదకరం కాకుండా చేయడమే తమ లక్ష్యాలని నెతన్యాహు చెప్పుకొచ్చారు.