Telangana : ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో మహిళలకు సమాంతర రిజర్వేషన్లు అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
ప్రత్యక్ష నియామకాల్లో మహిళలకు ప్రత్యేకంగా రోస్టర్ పాయింట్ ను మార్క్ చేయకుండా ఓపెన్, రిజర్వ్డ్ కేటగిరీల్లో 33 1/3% రిజర్వేషన్లు అమలు చేయాలని ఆదేశించింది. దీంతో మహిళలకు వర్టికల్ రిజర్వేషన్లు వర్తించవు. రిజర్వేషన్లపై స్పష్టత రావడంతో టీఎస్పీఎస్సీ సహా ఇతర నియామక బోర్డులు ఫలితాలను త్వరలో వెల్లడించనున్నాయి.
కాగా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉచిత కరెంట్ గ్యారంటీ అమలుపై కసరత్తు చేస్తోంది. కొన్ని రోజులుగా అధికారులు ఈ పథకానికి సంబంధించిన అర్హులను గుర్తించేందుకు ఇంటింటికీ వెళ్లి కనెక్షన్ల వివరాలు సేకరిస్తున్నారు. అయితే తొలి దశలో ‘గృహజ్యోతి’ కింద రేషన్‌కార్డు, ఆధార్, సెల్‌ఫోన్ నంబరు అనుసంధానమై ఉన్న కరెంటు కనెక్షన్ల ఇళ్లకు ఉచిత విద్యుత్ సరఫరా చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.